EBM News Telugu

కోచ్‌ అయ్యేందుకు అంతర్జాతీయ అనుభవం అవసరం లేదు: గంభీర్

0

ఢిల్లీ: టీ20 ఫార్మాట్‌లో విజయవంతమైన కోచ్‌ అయ్యేందుకు అంతర్జాతీయ అనుభవం అవసరం లేదు అని టీమిండియా మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. కోచ్‌ చేయాల్సిందల్లా ఆటగాళ్లలో సానుకూల ధోరణి పెంచడమేనని గౌతీ పేర్కొన్నాడు. అయితే టీ20 ఫార్మాట్‌కే ప్రత్యేక బ్యాటింగ్‌ కోచ్‌ను నియమించాల్సిన అవసరం ఉందని గంభీర్‌ అబిప్రాయపడ్డాడు.

స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ కనెక్టెడ్’లో గౌతమ్‌ గంభీర్ మాట్లాడుతూ… ‘టీ20 క్రికెట్‌కు లేదా ఒక భిన్నమైన ఫార్మాట్‌కు ప్రత్యేకమైన కోచ్‌ ఉంటే మంచింది. అంతర్జాతీయ క్రికెట్‌ అనుభవం లేని, ఎక్కువ క్రికెట్‌ ఆడని వారు విజయవంతమైన కోచ్‌ కాలేరన్నది నిజం కాదు. టీ20 క్రికెట్‌లో ఆటగాళ్ల మానసిక ధోరణి మార్చడం, సానుకూల దృక్పథం పెంచడమే కోచ్‌ పని. భారీ షాట్లు ఆడేలా, నిర్ణీత లక్ష్యాలు సాధించేలా ప్రేరణ అందించాలి’ అని గంభీర్‌ తెలిపాడు.

టీ20 క్రికెట్‌లో షాట్లు ఎలా ఆడాలో నేర్పించడం కోచ్‌ పని కాదని గంభీర్‌ స్పష్టం చేశాడు. ‘ల్యాప్‌ షాట్‌ లేదా రివర్స్‌ ల్యాప్‌ షాట్‌ ఎలా ఆడాలో ఎవ్వరూ నేర్పించరు. ఏ కోచ్‌ కూడా ఆ పని చేయడు. ఎవరైనా అలా చేస్తున్నారంటే.. అతడు ఆటగాడికి మేలు కన్నా చెడే ఎక్కువగా చేస్తున్నారని అర్థం’ అని గౌతీ అన్నాడు. విజయవంతమైన క్రికెటర్‌ మెరుగైన సెలక్టర్‌గా మారగలడన్నాడు. ‘విజయవంతమైన కోచ్‌ అయ్యేందుకు ఎక్కువ అనుభవం అవసరం లేదు. కానీ సెలక్టర్‌ విషయంలో మాత్రం అనుభవం పనికొస్తుంది’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Leave A Reply

Your email address will not be published.