Azharuddin: తెలంగాణ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న అజార్.. ఏ నియోజకవర్గం నుంచంటే..? – Telugu News | Telangana Polls 2023: Mohammad Azharuddin faces protest from Congress workers in Hyderabad’s Jubilee Hills constituency
Telangana Polls 2023: హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో రచ్చ మొదలైంది. విష్ణువర్థన్ రెడ్డి వర్సెస్ అజారుద్దీన్‌గా రాజకీయం టర్న్ తీసుకుంది. జూబ్లీహిల్స్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి అజారుద్దీన్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటన చేయడంతో రాజకీయ కాక పీక్స్ కు చేరింది. నియోజక వర్గంలో పర్యటించడమ కాకుండా ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారంటున్నారంటూ అజారుద్దీన్ అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ రోజు రోజు పెరుగుతోంది. టికెట్ ఆశావాహులు తమ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే.. మరో వైపు నియోజకవర్గంల్లో యాక్టవ్ అయ్యారు. దీంతో ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలు వ్యక్తిగత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో రచ్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీకి కాంగ్రెస్ పార్టీ నేత, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటన చేయడంతో రాజకీయ కాక పీక్స్ కు చేరింది. నియోజక వర్గంలో పర్యటించడమే కాకుండా ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారంటున్నారంటూ అజారుద్దీన్ ప్రకటన చేశారు.
దీంతో విష్ణువర్థన్ రెడ్డి వర్సెస్ అజారుద్దీన్‌గా రాజకీయం టర్న్ తీసుకుంది. అజారుద్దీన్ తీరుపై విష్ణువర్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌తో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటన చేశారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన అజారుద్దీన్ అనుచరులను విష్ణు వర్గం అడ్డుకుంది. విష్ణు కూడా పార్టీ హైకమాండ్‌పై కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటన అగ్గి రాజేసింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పార్టీ టికెట్ ఆశించిన అజహరుద్దీన్ స్థానికులతో సమావేశమయ్యేందుకు నియోజకవర్గానికి రాగానే నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెహ్మత్ నగర్ ప్రాంతంలో అజారుద్దీన్ సభ నిర్వహిస్తున్నప్పుడు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి మద్దతుదారులు కొందరు నిరసనకు దిగారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటించడంతో కొత్త వివాదం తెరమీదికి వచ్చింది. ఇది ఒకే పార్టీలోని మరో వర్గాన్ని రెచ్చగొట్టినట్లుగా మారింది.
నియోజకవర్గంలోని రెహమత్ నగర్‌లో ఆ పార్టీ నేత, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తన అనుచరులతో కలిసి ఓ సభను ఏర్పాటు చేశారు. ఆ సభను పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. తమ నియోజకవర్గంలో మీ ప్రచారం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. దీంతో ఇద్దరు నేతల అనుచరుల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ బరిలోకి దిగుతారనే ప్రచారానికి బలం చేకూరుస్తూ.. బుధవారం మొదటిసారి సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ డివిజన్లలో పర్యటించారు. ముందుగా ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాసేపు ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ నుంచి కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారని ఈ సందర్భంలో వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ప్రయత్నిస్తానని అన్నారు. అందులో భాగంగానే తాను ఇక్కడ పర్యటన చేస్తున్నట్లుగా అజారుద్దీన్ ప్రకటించారు. మరి అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం