Bhola Shankar: చిరంజీవి భోళాశంకర్ సినిమా టికెట్ల విషయంలో ఏం జరిగింది..? కారణాలేంటీ.. ఆ ఆరోపణల్లో నిజమెంత.. – Telugu News | Exactly What Happened In Megastar Chiranjeevi’s Bhola Shankar Movie Ticket Controversy Here in the details
Bhola Shankar Ticket Price Controversy: సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు సమాచార ప్రసార విభాగం జారీ చేసిన నిబంధనల ప్రకారం మొత్తం సెన్సార్ అయిన సినిమాలో కనీసం 20 శాతం సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాలనే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సూచించింది. అనుమతి కోరుతూ నిర్మాతలిచ్చిన లేఖలో వైజాగ్ పోర్టు, అరకులో 25 రోజులు పాటు షూటింగ్ చేసినట్టు ప్రకటించారు.
Bhola Shankar Ticket Price Controversy
Bhola Shankar Ticket Price Controversy: ఆంధ్రప్రదేశ్‌లో భోళా శంకర్ టిక్కెట్ రేట్ పెంపు విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆగస్ట్ 11వ తేదీన (శుక్రవారం) విడుదలవుతున్న చిరంజీవి సినిమా విషయంలో అసలు జరిగింది.. ఎందుకు వివాదంగా మారింది..? ఇటీవల చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమా..? లేక మరదేమైనా ఉందా..? అంటే.. చిరంజీవి ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై, టిక్కెట్ రేట్ల పెంపునకు ఎలాంటి సంబంధం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. టిక్కెట్ రేట్ల పెంపునకు సంబంధించిన నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా పెంపు ఉండేదని పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను చిత్ర నిర్మాత పట్టించుకోలేదని..దీంతోనే ఇలా జరుగుతుందని పేర్కొంటున్నాయి. భోళాశంకర్ సినిమా టికెట్ల ధర పెంచుకునేందుకు అనుమతి విషయంలో సినిమా రూపకర్తల నుంచి ఏపీ ప్రభుత్వం మొత్తం 12 విషయాల్లో వివరణ కోరింది. అంతేకాదు వివరణ కోసం పరిశీలనాధికారులు కోరే ఇతర పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుందని తన ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఓ నెంబర్ 13లో పేర్కొన్న రిజిస్ట్రేషన్ నిబంధనను సినిమా నిర్మాతలు పాటించలేదని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. ఆ నిబంధనను భోళాశంకర్ సినిమా పాటించలేదని తెలిపింది.
సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు సమాచార ప్రసార విభాగం జారీ చేసిన నిబంధనల ప్రకారం మొత్తం సెన్సార్ అయిన సినిమాలో కనీసం 20 శాతం సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాలనే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సూచించింది. అనుమతి కోరుతూ నిర్మాతలిచ్చిన లేఖలో వైజాగ్ పోర్టు, అరకులో 25 రోజులు పాటు షూటింగ్ చేసినట్టు ప్రకటించారు. అయితే ఏ ప్రాంతంలో షూటింగ్ చేశారో ఆ యజమాని నుంచి ఒక సర్టిఫికేట్ సమర్పించాలని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెలిపింది.
సూపర్ హై బడ్జెట్ తెలుగు సినిమా నిబంధనను కూడా ఈ చిత్రం పాటించలేదని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. సినిమా పూర్తైన తర్వాత, విడుదలకు ఒక నెల ముందు రిజిస్ట్రేషన్ నిబంధనను కూడా ఈ సినిమా పాటించలేదని స్పష్టం చేసింది. సినిమా ఖర్చు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ సమర్పించాలని కూడా సూచించింది. పూర్తి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌తో పాటు CA జారీ చేసిన ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు, ఆడిట్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ సమర్పించాలని కోరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పాటు 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ ధృవీకరించిన ఫైనాన్షియల్ స్టేట్స్‌మెంట్స్ సమర్పించాలని సూచించింది.
భోళాశంకర్ సినిమాకు సంబంధించి ప్రతీ సెక్షన్ కింద మినహాయించిన TDS, ప్రతీ సెక్షన్ కింద డిపాజిట్ చేసిన మొత్తాల పూర్తి వివరాలతో పాటు ఖర్చు స్టేట్‌మెంట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంతే కాదు TDS రిటర్న్స్ సమర్పించినట్టుగా అక్నాలెడ్జ్‌మెంట్ కూడా అందజేయాలని సూచించింది. ఈ సినిమాకు సంబంధించి GST రిటర్న్స్ సమర్పించలేదని విషయాన్ని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రస్తావించింది. భోళాసంకర్‌కు సంబంధించి GSTR-1, GSTR-2B, GSTR-3Bతో పాటు GSTR 9, 9C రిటర్న్స్ కూడా అందజేయాలని సూచించింది. ఆదాయ పన్ను చట్టం, 1961, కంపెనీల చట్టం 2013 ప్రకారం ఆడిట్ రిపోర్టులు అందజేయాల్సి ఉంటుంది.
వెరిఫికేషన్ కోసం సినిమాకు సంబంధించి GST కాకుండా చేసినట్టుగా చెప్తున్న 101 కోట్ల రూపాయలకు సంబంధించి అన్ని బ్యాంకు ఖాతాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ సమర్పించలేదని తెలిపింది. 2021-22, 2022-23 సంవత్సరాలకు సంబంధించి 5 లక్షల రూపాయలకు కంటే ఎక్కువ మొత్తంలో చేసిన ఖర్చులకు సంబంధించి ఇన్వాయిస్ కాపీలు, అలాగే 5 లక్షల రూపాయల కంటే తక్కువ మొత్తం ఖర్చుకు సంబంధించిన సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ రెండేళ్ల కాలంలో చాలా సినిమాలు నిర్మించి ఉంటారు కాబట్టి వాటిని పక్కన పెట్టి భోళాశంకర్ సినిమాకు అయిన ఖర్చుకు సంబంధించి వివరాలు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వాలని కోరింది.
ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్‌ను కూడా నిర్మాతలు సమర్పించలేదనే ప్రస్తావించింది. సినిమా నిడివి, సినిమా భాషకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ అందజేయాలని తెలిపింది. భోళాశంకర్ సినిమా కథను టూకీగా తమకు సమర్పించాలని కూడా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సూచంచింది. GST గనక తీసుకొని ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో GST రిజిస్ట్రేషన్ వివరాలు సమర్పించాలని కోరింది.
అయితే, నిర్మాత నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఏమీ చేయలేకపోయామంటూ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు అందకపోవడంతో టికెట్ల రేట్ల విషయం ముందుకు సాగలేదని.. అంతే తప్ప చిరంజీవి ప్రభుత్వం విమర్శలు చేయడంతోనే రేట్ల పెంపు జరగలేదనడం సరైంది కాదంటూ అధికార వర్గాలు తెలిపాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..