Leading News Portal in Telugu

తెలంగాణలో ప్రియాంక.. మెదక్ నుంచేనా పోటీ | priyanka to contest from medak| indira| sentiment| loksabha| congress| telangana| affairs| southern


posted on Aug 16, 2023 10:01AM

 హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ, ఈ  ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్  అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు  వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రణాళికా బద్ధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ లో వర్గ విభేదాలు సహజమే అయినా.. వీటి ధాటి, ప్రభావం ఏ ఇతర రాష్ట్రంలో కంటే తెలంగాణలో అధికం. ఈ రాష్ట్రంలో నేతలంతా తాము ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న స్థాయిలో బిల్డప్ ఇచ్చుకుంటుంటారు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ  ప్రచార బాధ్యతలు పార్టీ  ప్రధాన కార్యదర్శి  ప్రియాంక వాద్రా గాంధీకి   అప్పగించింది.

తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలన్నీ ప్రియాంకగాంధీకే అప్పగించారని కూడా పార్టీలో గట్టిగా ప్రచారం అవుతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రియాంక రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీచేస్తారని, పార్టీలో చర్చ జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతుంటే.. పరిశీలకులు కూడా ఆ అవకాశాలే అధికంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. గతంలో మెదక్ లోక్ సభ స్థానం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మెదక్ లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. అది సెంటిమెంట్ పరంగా కూడా కాంగ్రెస్ కు బాగా కలిసివస్తుందని చెబుతున్నారు.

వాస్తవానికి ప్రియాంకా గాంధీ చాలా కాలంగా..  తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక  దృష్టి పెట్టారు. ఒక దశలో,  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్య మాటల యుద్ధం గీతలు దాటి న సమయంలో ప్రియాంక జోక్యంతోనే వారి మధ్య విభేదాలు, వివాదాలు సర్దుమణిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మునుగోడు ఉప ఎన్నికల సమయంలో, కోమటి రెడ్డి వెంకట రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్  చేసిన  వ్యాఖ్యలు …ఆపై అటు నుంచి ఇటు నుంచి అటు పేలిన మాటల తూటాల నేపధ్యంలో, తమ్ముడు రాజగోపాల రెడ్డి బాటలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు. 

అయితే,  ప్రియాంక  గాంధీ జోక్యం చేసుకుని కోమటి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతనే ఆయన మెత్తబడి, ఎన్నికల సమయంలో వివాదాలకు దూరంగా   విదేశాలకు వెళ్ళారని అంటారు. దీనిలో నిజానిజాలేమిటన్నది పక్కన పెడితే.. కోమటి రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ  కావడం నిజం. ప్రియాంక గాంధీతో భేటీ తరువాతనే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు పూర్తి అబద్ధాలనీ, తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాడినేనని విస్పష్టంగా చెప్పారు. అదీ వాస్తవమే.  అందుకే  కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీలో కొనసాగడానికి ప్రియాంక  గాంధీచూపిన చొరవే కారణమని పార్టీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.

  అలాగే  రేవంత్ రెడ్డికి అనుకూలం అనే ముద్ర పడిన  మాణిక్యం ఠాగూర్‌ ను పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి, మాణిక్‌రావ్‌ ఠాక్రే కు బాధ్యతలు అప్పగించడంలోనూ ప్రియాంకా గాంధీ ప్రమేయమే ఎక్కువగా ఉందని చెబుతారు. ఇవన్నీ ఒకెత్తైతే..  ప్రియాంక వాద్రాకు ఎన్నికల బరిలో దిగి  పార్లమెంట్ లో అడుగుపెట్టాలనే కోరిక బలంగా ఉంది.  2019 ఎన్నికల్లోనే ఆమె యూపీలో వారాణాసి నుంచి ప్రధాని మోడీకి ప్రత్యర్థిగా రంగంలోకి దిగేందుకు సై అన్నారు. అయితే అప్పట్లో కారణాలేమైనా ఆమె పోటీ చేయలేదు. ఇందుకు రాహుల్ గాంధీ ఆమె మోడీకి ప్రత్యర్థిగా బరిలోకి దిగడం పట్ల సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీకి ప్రత్యర్థిగా దిగితే ప్రియాంక ఓటమిని ఎదుర్కొనే అవకాశాలే  ఎక్కువ ఉన్నాయని అప్పట్లో రాహుల్ భావించడమే అందుకు కారణమని అంటారు.  

ఆ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రియాంక ప్రచార బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ  చిత్తుగా ఓడిపోయిన నేపధ్యంలో  ప్రియాంక యూపీ మీద ఆశలు వదులుకున్నారని, అప్పటి నుంచే ఆమె పార్లమెంట్ ఎంట్రీకి తెలంగాణ అయితే సరైన వేదిక అవుతుందని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అందుకే స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా, ఉభయ తారకంగా ప్రియాంకకు తెలంగాణ బాధ్యతలను పార్టీ హైకమాండ్ అప్పగించిందని చెబుతున్నారు. గతంలో ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్  ప్రియాంక పోటీకి దిగి విజయం సాధించేందుకు సరైన వేదిక అని పార్టీ హైకమాండ్ భావిస్తోందంటున్నారు.  

అందుకే ఇటీవల కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడ నుంచి నేరుగా ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించారు. త్వరలో మరోసారి కూడా రాష్ట్ర పర్యటనకు రానున్నారు.   మే నెల 9న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని, నేరుగా  హైదరాబాద్‌లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో ఆమె పాల్గొని కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.  జూన్ చివరివారం లేదా జులై మొదటివారంలో ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు అప్పట్లో షెడ్యూల్ ఖరారైనా.. అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది.  అమె త్వరలో తెలంగాణలో పర్యటించి మెదక్ జిల్లాలో భారీ బహిరంగ లో పాల్గొంటారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ఆ సభలోనే ప్రియాంక బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.