Leading News Portal in Telugu

IND vs IRE: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా! ఎవరికీ సాధ్యం కాలె


Team India Captain Jasprit Bumrah Set To Unique Record His Name In History Books: వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కోల్పోయిన భారత్.. మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆరంభం అయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లు జియో సినిమా, స్పోర్ట్స్18 చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత యువ జట్టు ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఐర్లాండ్‌కు చేరింది.

ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 వంటి మెగా టోర్నీల నేపథ్యంలో సీనియర్లు ఐర్లాండ్‌ టీ20 సిరీస్ ఆడడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లతో సహా చాలా మంది రెగ్యులర్‌ ప్లేయర్లకు బీసీసీఐ ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చింది. సీనియర్లు గైర్హాజరు కావడంతో బీసీసీఐ సెలక్టర్లు పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీని అప్పగించారు. గాయం కారణంగా 11 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్‌తో మొదటి టీ20 ద్వారానే తన పేరుపై ఓ అరుదైన రికార్డు లిఖించుకోనున్నాడు.

టీ20లో భారత జట్టుకు నాయకత్వం వహించిన తొలి బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలవనున్నాడు. టీ20లో ఇప్పటివరకు టీమిండియాకు 10 మంది నాయకత్వం వహించినా.. అందరిలో ఎవరూ కూడా స్పెసలిస్ట్ బౌలర్ లేరు. 9 మంది బ్యాట్స్‌మెన్ కాగా.. ఓ ఆల్‌రౌండర్ ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు నాయకత్వం వహించిన మొదటి కెప్టెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. 2007 టీ20 ప్రపంచకప్ నుంచి ఎంఎస్ ధోనీ సారథిగా ఉన్నాడు. మహీ గైర్హాజరీలో సురేశ్ రైనా, అజింక్యా రహానే కొన్ని మ్యాచ్‌ల్లో జట్టును నడిపించారు.

2017లో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జట్టుకు నాయకత్వం వహించారు. 2022లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లకు కూడా జట్టు బాధ్యతలు అందుకున్నారు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్‌గా చేశాడు. ఇందులో హార్దిక్ (ఆల్‌రౌండర్) మిన్నగా మిగతావారందరూ బ్యాట్స్‌మెన్లు అన్న విషయం తెలిసిందే. దాంతో జస్ప్రీత్ బుమ్రా కొత్త రికార్డును తన పేరుపై లిఖించుకోనున్నాడు.