Leading News Portal in Telugu

Punganur Riots: పుంగనూరు అల్లర్లలో కొత్త కోణాలు.. 4 రోజుల ముందే టీడీపీ ప్లాన్


Punganur Riots: పుంగనూరు అల్లర్లలో కొత్త కోణాలు బయటపడ్డాయి. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్‌ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్‌ఛార్జ్‌ చల్లా బాబు అనుచరుల వాంగూల్మంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఎదుట చల్లా బాబు అనుచరులు నరీన్‌కుమార్‌, దూవల అమర్నాథ్‌, పెద్దన్న సుబ్రహ్మణ్యం నేరం ఒప్పుకున్నారు.

ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు టీం, చల్లా బాబు అనుచరులు స్కెచ్‌ వేశారని తెలిసింది.. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్‌ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్‌ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్‌ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగూల్మంలో చల్లా బాబు అనుచరులు స్పష్టం చెప్పారు.ఆగస్టు 2వ తేదీన చల్లా బాబు ఇంటి వద్ద రహస్య సమావేశం జరిగిందని.. సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు పాల్గొన్నరని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు వెల్లడించారు. పోలీసులపై దాడి చేసి గాయపరిచి, అవసరమైతే హత్యలు చేసైనా అల్లర్లు సృష్టించాలనే ప్లాన్ చేసినట్లు తెలిసింది. పుంగనూరు టౌన్‌లోకి బలవంతంగా దూసుకెళ్తే అల్లర్లు జరుగుతాయని.. పోలీసులు కాల్పులు జరిపే పరిస్థితి ఏర్పడుతుందని.. పోలీసుల కాల్పుల్లో ఎవరైనా టీడీపీ కార్యకర్తలు చనిపోతే..టీడీపీకి ఇమేజ్ వస్తుందని చల్లా బాబు చెప్పారని చల్లా బాబు అనుచరుడు వాంగ్మూలంలో వెల్లడించారు.

ఆగస్టు 4 మధ్యాహ్నం 3.30కి భీమగాని జంక్షన్ వద్దకు చేరుకున్నామని.. గొడవలు చేయాలని టీడీపీ శ్రేణలకు చల్లా బాబు ఫోన్లు చేశారని తెలిపారు.జంక్షన్ వద్దకు చేరుకోగానే పోలీసుల బారికేడ్లు కనిపించాయని..పోలీసులపై దాడి చేసి చంద్రబాబును పుంగనూరు టౌన్‌లోకి తీసుకెళ్లాలని చల్లా బాబు అందరినీ రెచ్చగొట్టారని వాంగ్మూలంలో తెలిసింది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కర్రలు , రాళ్లు, బీర్ బాటిళ్లతో దాడి చేశామని, పోలీసులను హత్య చేయాలని ఉద్దేశంతో రాళ్లతో దాడి చేశామని.. ఈ దాడిలో డ్యూటీలో ఉన్న సీఐతో పాటు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని చల్లాబాబు అనుచరుడు చెప్పాడు. దీంతో పోలీసులు తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని.. చల్లా బాబు ఆదేశాలతో పోలీసులపై బీర్ బాటిళ్లతో దాడి చేశామని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అక్కడ ఉన్న పోలీస్ వాహనంపై డీజిల్ పోసి తగలబెట్టామని చల్లాబాబు అనుచరుడు చెప్పాడు.

తర్వాత అక్కడే ఉన్న పోలీసుల ఐసర్ వాహనాన్ని కూడా ధ్వంసం చేసి నిప్పంటించామని.. బారికేడ్లు తీయాలంటూ పోలీసులపైకి రాళ్లు, కర్రలతో దాడి చేశామని అనుచరుడు చెప్పుకొచ్చాడు. తాము దాడి చేయడంతో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని.. డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ ప్రసాద్‌కు తీవ్ర గాయమైందని చల్లా బాబు అనుచరుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. గాయాలైన పోలీసులను అక్కడి నుంచి చికిత్స కోసం తీసుకెళ్లారన్నాడు. గొడవ జరిగిన కొద్దిసేపటికి మా నాయకుడు చంద్రబాబు అక్కడికి వచ్చారని.. చంద్రబాబు వాహనంలోనే చల్లా బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారని అనుచరుడు చెప్పుకొచ్చాడు.