వంగవీటి రాధ వివాహం..జనసేన నేత కుమార్తెతో | vangaveeti radha marriage| janasena| narasapuram| leader| pawan| house| varaahi
posted on Aug 16, 2023 11:25PM
వంగవీటి రాధా కృష్ణ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. దివంగత వంగవీటి రంగా కుమారుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి వంగవీటి రాధాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాతికేళ్ల పిన్న వయస్సులోనే (2004 ) ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైయ్యారు. విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఇంత కరిష్మా గల రంగకు అభిమానుల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువే. వంగవీటి రాధ రాజకీయ వారసుడిగా ఆయన నిత్యం తన అనుచరులకు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. అటువంగటి నేత పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ముగింపునకు వచ్చేశాయి. వంగవీటి రాధా పెళ్లికి ముహూర్తం కుదిరింది. నిశ్చితార్ధం ఈ నెల19, వివాహం వచ్చేనెల 6న జరుగుతుంది.
ఇంతకీ ఆయన వివాహమాడబోయేది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్మాజీ ఛైర్ పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జి ల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీని. ప్రస్తుతం వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో సహజంగానే ఆయన వియ్యమొందబోయే కుటుంబ రాజకీయ నేపథ్యం ఏమిటన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇంతకీ వంగవీటి రాధ వివాహమాడబోయే పుష్పవల్లి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందా? అంటే ఉంది. ఆమె తల్లి నరసాపురం మాజీ చైర్ పర్సన్. ప్రస్తుతం పుష్పవల్లి కుటుంబం జనసేనలో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నది. ఇటీవల వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్ వారి ఇంట్లోనే బస చేశారు.
దీంతో కొంత కాలం కిందటి వరకూ ఏపీ రాజకీయాలలో వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీని వీడతారంటూ జరిగిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. జనసేన పార్టీకి చెందిన కుటుంబంలోని అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనుండటంతో వంగవీటి రాధ జగసేన గూటికి చేరే అవకాశాలున్నాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే పరిశీలకులు మాత్రం వంగవీటి రాధ వివాహానికి, ఆయన రాజకీయాలకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జనసేన తెలుగుదేశంతో పొత్తు వార్తల నేపథ్యంలో కూడా వంగవీటి రాథ, పుష్పవల్లిల వివాహం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.