Leading News Portal in Telugu

ఈ ఐదు వ్యూహాలు చాలు దేశం నంబర్ వన్.. చంద్రబాబు విజన్ 2047 | chandrababu vision document| 2047| five| strategies| india| number


posted on Aug 16, 2023 10:52PM

 వర్తమాన రాజకీయాలలో దార్శనికుడు అనగానే ఎవరికైనా వెంటనే స్ఫురించే పేరు నారాచంద్రబాబు నాయుడు.   తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది  ఐటీ.. విజన్. మన దేశంలో ఇప్పుడున్న సీనియర్ నేతలలో ముందు చూపు కలిగిన నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. దేశ విదేశాల కంపెనీల ప్రతినిధుల నుండి అమెరికా అధ్యక్షుల వరకూ ఈ మాట ఎప్పుడో చెప్పారు. అందుకు తగ్గట్లే చంద్రబాబు అనునిత్యం దేశ భవిష్యత్ బాగుండాలనీ, పేదరికం పోవాలని పరితపిస్తుంటారు. అందుకే అందరూ ఈ రోజు గురించి ఆలోచిస్తే చంద్రబాబు రేపటి గురించి ఆలోచిస్తారని రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. రానున్న దశాబ్దంలో మన సమాజాన్ని నడిపించేది ఏంటో ఆయన శోధించి ఆ దిశగా సమాజాన్ని నడిపించాలన్నది ఆయన తపన. గతంలో అలా ఆయన వేసిన బీజమే నేడు హైదరాబాద్ నగరానికి దీటుగా ఎదిగిన సైబరాబాద్. గతంలో ఆ  ఆ దిశగా పనిచేసి తన  దార్శనికత ఏంటో చాటారు. ఇప్పుడు మరోసారి విజన్ డాక్యుమెంట్-2047తో ప్రజల ముందుకొచ్చారు. 

చంద్రబాబు మంగళవారం విశాఖ సభలో విజన్ డాక్యుమెంట్-2047ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంట్ లో భారత్ నెంబర్ 1 అయ్యేందుకు ఏం చేయాలో సూచించారు. ఇందుకోసం చంద్రబాబు నాయకత్వంలోని జీఎఫ్ఎస్టీ బృందం 5 వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది. ఇండియా 2047 నాటికి స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి భారత్ ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా @ 100 అనే కాన్సెప్ట్‌తో విజన్ డాక్యుమెంట్-2047 తయారైంది. ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు సభ్యులుగా  చంద్రబాబు చైర్మన్ గా వ్యవహరిస్తున్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్   గత కొన్నినెలలుగా తీవ్ర కసరత్తులు చేసి ఈ  ఈ విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేసింది. 

ఈ విజన్ డాక్యుమెంట్-2047 విషయానికి వస్తే.. ఇందులో మొత్తం 5 వ్యూహాలను సూచించారు. ఈ ఐదింటిలో 1. సోలార్ ఎనర్జీ, విండ్, పంప్డ్ ఎనర్జీ, హైబ్రిడ్ మోడల్ డెమోక్రటైజేషన్, డీకార్బనైజేషన్ అండ్ డిజిటలైజేషన్, 2. వాటర్ సెక్యూర్ ఇండియా 3. డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లీడర్స్ ఆఫ్ ఫ్యూచర్ 4. డెమొగ్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ పీ4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్ 5. ఇండియన్ సిటిజెన్ టు సర్వ్ గ్లోబల్ ఎకానమీ. సోలార్, విండ్, హైడల్ మూడింటినీ కలిపి హైబ్రిడ్ మోడల్ తయారుచేసి సరికొత్త పవర్ చేంజర్ తో ముందుకెళ్లాలని.. అప్పుడే అన్ని రంగాలకు విద్యుత్ అందుతుందని చంద్రబాబు చెప్పారు. దీంతో కాలుష్యం కూడా ఉండదని.. డిజిటలైజేషన్ వల్ల విద్యుత్ గ్రిడ్ మేనేజ్ చేసుకోవచ్చని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో సోలార్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించిన విధానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

 ఇక, మిగతా విషయాలకు వస్తే విజన్ డాక్యుమెంట్ -2047లో రెండో ప్రాధాన్యత నీటికి ఇచ్చారు. ఇటు హైడల్ ఎనర్జీలో నీళ్లే కీలకం.. అటు వ్యవసాయానికి కూడా నీళ్లు కావాలి. అందుకే భారత్ నీటి పరంగా పూర్తి భరోసాతో ఉండాలనే వాటర్ సెక్యూర్ ఇండియా సిద్ధాంతం తీసుకువచ్చినట్లు చెప్పారు. మూడవ అంశం డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. టెక్నాలజీతో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయని..ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నవ్వారు. సెల్ ఫోన్ ఏమైనా తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు. కానీ ఆ రోజు ఒకటే చెప్పాను… సెల్ ఫోన్ ను అందరూ గుర్తించే రోజు వస్తుంది అని స్పష్టం చేశాను. ఇవాళ సెల్ ఫోన్ తిండిపెట్టడమే కాదు, లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తోంది.  

ఈ విజన్ 2047లో చివరి రెండు అంశాలు డెమొగ్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ పీ4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్, ఇండియన్ సిటిజెన్ టు సర్వ్ గ్లోబల్ ఎకానమీ. 2047 తర్వాత దేశంలో ముసలివాళ్ల సంఖ్య పెరిగి, యువత సంఖ్య తగ్గిపోతుంది, పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ జనాభా నిర్వహణ సిద్ధాంతం ఆ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఇప్పటివరకు దేశంలో జనాభా తగ్గించే ఉద్దేశంతో నియంత్రణకు వెళ్లగా.. ఇప్పుడు అధిక జనాభానే అనుకూలత అయ్యే పరిస్థితులు వస్తాయని అందుకు మనం ముందే సిద్ధంగా ఉండాలని సూచించారు. చివరిగా ప్రతి ఒక్కరూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోవడం కాదు.. ఈ స్వతంత్ర భారతదేశంలో పేదరికం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందని.. ప్రతి వ్యక్తి తన సేవలను, తన ఉత్పాదనలను ప్రపంచానికి అందించే దిశగా ఆలోచిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా, చంద్రబాబు విజన్ డాక్యుమెంటరీ 2047పై ఇప్పటికే ఎందరో నిపుణులు స్పందించి ఈ ఐదు సూత్రాలు చిత్తశుద్ధితో అమలు చేసే భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని పేర్కొంటున్నారు.