Leading News Portal in Telugu

లోకేష్ పాదయాత్రలో విధ్వంసానికి కుట్ర.. సజ్జల వ్యూహం ఇదేనా? | Conspiracy to create destruction in vijjayawada| lokesh| padayatra| three| days| candidayes| announce| sajjala


posted on Aug 17, 2023 7:44AM

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. మంగళగిరిలో అయితే ఆయన పాదయాత్ర జన సంద్రాన్ని తలపించింది. నియోజకవర్గ ప్రజలంతా లోకేష్ వెంట నడిచారా అన్నట్లుగా ఆయన పాదయాత్ర సాగింది. దీంతో అధికార వైసీపీలో ఖంగారు మొదలైంది. ఆయన పాదయాత్ర విజయవాడలో అడుగుపెట్టడానికి ముందే ప్రభుత్వ సలహాదారు విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు.

వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ మీదే.. ఇక లోకేష్ పాదయాత్రకు ఎలా అడ్డంకులు సృష్టిస్తారో మీ ఇష్టం అన్నట్లుగా సజ్జల అభ్యర్థుల ప్రకటన ఉంది.  విజయవాడ ఈస్ట్ అభ్యర్థిగా దేవినేని అవినాష్,  సెంట్రల్ అభ్యర్థిగా మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లిని ఖరారు చేశారు. వీరిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. నిన్న మొన్నటి వరకూ ఈ ఇద్దరికీ టిక్కెట్లు అనుమానమే అంటూ పార్టీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే.. లోకేష్ పాదయాత్ర బెజవాడలోకి ప్రవేశించే సమయానికి వైసీపీ వ్యూహం మార్చేసింది. ఎనిమిది తొమ్మిది నెలల తరువాత జరిగే ఎన్నికలలో విజయం కంటే..   లోకేష్ పాదయాత్రకు విజయవాడ లో  అవరోధాలు కల్పించడమే ముఖ్యమని భావించింది. అందుకే అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు ప్రకటించే సంప్రదాయాన్ని కాదని మరీ   సజ్జల చేతే అభ్యర్థులను ప్రకటించేశారు.

పార్టీ టికెట్ ఖరారైంది కనుక దేవినేని అవినాష్, మల్లాది, వెల్లంపల్లిలకు లోకేష్ పాదయాత్రలో అవరోధాలు కల్పించడమనే బాధ్యతను అప్పగించినట్లు చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు సజ్జల ప్రకటన శంఖంలో పోసిన చందంగా జగన్ కూడా ఆమోదం తెలపాలంటే.. ఈ ముగ్గురూ లోకేష్ పాదయాత్రను సక్సెస్ ఫుల్ గా అడ్డుకుని తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవలసి ఉంటుందన్నమాట. ఒక వేళ ఆ విషయంలో వారు విఫలమైతే జగన్ రేపు మీరు అభ్యర్థులు కాదని తన గొంతుతో ప్రకటించే అవకాశాలున్నాయి.. అలాగే ఒక వేళ సక్సెస్ ఫుల్ గా లోకేష్ పాదయాత్రకు వారు ఆటంకాలు కల్పించి, దాడులకు పూనుకున్నా..పార్టీ టికెట్లు వారికే ఖరారౌతాయన్న నమ్మకం లేదని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే టికెట్లు ప్రకటించేందుకు సజ్జలకు ఎటువంటి అధికారమూ లేదు. ఆ ప్రకటనే జగన్ నుంచి రావాల్సి ఉంటుంది. వాడుకుని వదిలేయడమన్నది వైసీపీ డీఎన్ఏ లో ఉందనీ, అందుకే ఇప్పుడు సజ్జల ప్రకటనతో బెజవాడ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజవకర్గాల అభ్యర్థుల ప్రకటన సజ్జలతో చేయించడమే ఇందుకు నిదర్శనమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ అభ్యర్థుల ప్రకటన ద్వారా లోకేష్ పాదయాత్ర సజావుగా సాగకుండా అవరోధాలు కల్పించడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని భావించాల్సి ఉంటుందని అంటున్నారు.  మరో రెండు రోజుల్లో  లోకేష్ పాదయాత్ర విజయవాడలో ప్రవేశిస్తుంది. అక్కడ మూడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. సజ్జల హడావుడిగా విజయవాడలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం వెనుక లోకేష్ పాదయాత్రకు అవరోధాలు కల్పించే కుట్ర, వ్యూహం ఉన్నాయని తెలుగుదేశం నాయకులు, శ్రేణులు కూడా అంటున్నాయి. ఇప్పుడు సజ్జల ప్రకటించిన  విజయవాడ వెస్ట్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు జగన్ తొలి క్యాబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు ఎంత యథేచ్ఛగా జరిగాయో తెలిసిందే. అన్ని విధాలుగా ఆమాత్యుడిగా విఫలమయ్యారన్న కారణంతోనే ఆయనను జగన్ మంత్రి పదవి నుంచి తప్పించారని అప్పట్లో వైసీపీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఇక బెజవాడ సెంట్రల్ నియోజవకర్గ అభ్యర్థిగా ఇప్పుడు సజ్జల ప్రకటించిన మల్లాది విష్ణు గత ఎన్నికలలో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తరువాత బెజవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ ను సజ్జల ప్రకటించారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలిచిన బొప్పన భవకుమార్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ ను రంగంలోకి దించుతున్నట్లు సజ్జల ప్రకటించారు.

మొత్తం మీద విజయవాడ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులను ఇంత హడావుడిగా ప్రకటించడం వెనుక లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వారికి లైసెన్స్ ఇవ్వాలన్న లక్ష్యమే కారణమని పరిశీలకులు, తెలుగుదేశం శ్రేణులే కాదు.. బెజవాడ వాసులు కూడా అంటున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా విజయవాడలో వైసీపీ శ్రేణులు ఈ ముగ్గురి నాయకత్వంలో విధ్వంసానికి, దాడులకు తెగబడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.