Rashid Latif Says Team India are not well prepared for ICC ODI World Cup 2023: 2022 వరకు మూడు ఫార్మాట్‌లలో టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కోహ్లీ స్వయంగా టీ20 ఫార్మాట్ నాయకత్వం నుంచి తప్పుకున్నా.. బీసీసీఐ పెద్దలు వన్డే, టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగేలా చేశారు. కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు మూడు ఫార్మాట్‌లలో సారథిగా ఉన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌పై బీసీసీఐ ఎంతో నమ్మకం పెట్టుకుంది. అయితే ఆ అంచనాలను రోహిత్ అందుకోలేకపోయాడు.
సారథిగా రోహిత్ శర్మ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొడుతున్నా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్‌ను ఛాంపియన్‌గా నిలపలేకపోతున్నాడు. రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లోనూ భారత్ ఓడిపోయింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కూడా ఐసీసీ టోర్నీల్లో భారత్‌ను విజేతగా నిలపలేకపోయాడు. భారత్ చివరగా 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. మరో 45 రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత్ గురించి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరిగే మెగా టోర్నీకి భారత్ 100 శాతం సన్నద్ధం కాలేదన్నాడు. కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే.. భారత్ మరో లెవల్లో ఉండేదని అభిప్రాయపడ్డాడు.
‘మిడిల్, లోయర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో భారత్ యాజమాన్యం తరచూ మార్పులు చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. చాలా మంది ఆటగాళ్లతో ప్రయోగాలు చేసింది. 4 నుంచి 7 స్థానాలలో కొత్త ఆటగాళ్లను స్థిరంగా ఒక స్థానంలో ఆడించలేదు. ఈ కారణంగానే వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వస్తున్నారు. ఇది రిస్కే అయినా ప్రపంచకప్‌లో భారత్ సీనియర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే.. వన్డే ప్రపంచకప్‌కు భారత్ 100 శాతం సిద్ధంగా ఉండేది’ అని రషీద్ లతీఫ్ అన్నాడు.