Leading News Portal in Telugu

Rahul Gandhi: నెహ్రూ తాను చేసిన కృషితో ప్రసిద్ధి చెందారు .. పేరు వల్ల కాదు


ఢిల్లీలో నెహ్రూ మొమోరియల్‌ మ్యూజియం పేరును పీఎం మ్యూజియంపై మార్చడంపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ స్పందించారు. అనంతరం మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయ చరిత్ర నుంచి నెహ్రూ పేరును ఎవరు చెరిపేయలేరన్నారు. నెహ్రూ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తాను చేసిన మంచిపనులతో నెహ్రూకు గుర్తింపు వచ్చిందని, నెహ్రూ అన్న పేరుతో కాదని రాహుల్‌ తెలిపారు. కొన్నిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియంకి కొత్తగా ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీగా పేరు పెట్టింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ప్రధాని మోడీకి చాలా భయాలు, అభద్రతా భావాలు ఉన్నాయి. తొలి ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడమే బీజేపీ అజెండాగా పెట్టుకుందని కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ప్రధాన మంత్రి ఎంత ప్రయత్నించినా స్వాతంత్రం సమయంలో నెహ్రూ సాధించిన ఘనతలను సాధించలేరని ‘X’ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. మరో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ కూడా స్పందించారు. ‘‘ఇతర ప్రధానులకు స్థానం కల్పించేందుకు భారత తొలి ప్రధాని పేరును తీసివేయడం చాలా చిన్న పని. అయినా ఫర్వాలేదు, దీనిని నెహ్రూ మెమోరియల్‌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీగా పిలుచుకోవచ్చు’’ అని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. జవహార్‌లాల్‌ నెహ్రూ నుంచి నరేంద్ర మోదీ వరకు ఎంతో మంది ప్రధానమంత్రులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించిన అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుందని వివరించింది. నెహ్రూ చరిత్ర.. ముఖ్యంగా ఆయన నిర్మించిన భాక్రానంగల్‌ ప్రాజెక్ట్‌ గురించి మ్యూజియంలో సవివరింగా ఉందని వివరించారు.