Ravi Shastri Wants Virat Kohli to Bat at No 4 for ICC ODI World Cup 2023: గత కొన్నేళ్లుగా టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య ‘నెంబర్ 4’. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అనంతరం నాలుగో స్థానంలో ఎందరో ఆటగాళ్లను బీసీసీఐ పరీక్షించింది. ప్రపంచకప్ 2019కి ముందు అంబటి రాయుడు ఆ స్థానంలో కుదురుకున్నా.. తీరా మెగా టోర్నీలో అతడికి బీసీసీఐ ఛాన్స్ ఇవ్వలేదు. ఆపై శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో సెటిల్ అయ్యాడు. ఇంకా అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో శ్రేయాస్ గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు. దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సొంతగడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతున్నది. అయినా నాలుగో స్థానం పెద్ద ప్రశ్నగానే ఉంది. ఆ స్థానంలో ఎవరిని ఆడించాలన్నది టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది.
ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నాలుగో స్థానం భర్తీ చేయడం సవాల్‌తో కూడికున్నదని తెలిపాడు. అయితే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి నాలుగో స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని సూచించాడు. రికార్డుల కింగ్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ 4కు పర్ఫెక్ట్ అని తెలిపాడు. ప్రస్తుతం మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీని నాలుగో నెంబర్లో ఆడించాలని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తాను భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడే ఈ సలహా ఇచ్చానని, కానీ ఆ సమయంలో అమలు కాలేదని గుర్తుచేశాడు.
స్టార్ స్పోర్ట్స్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో బ్యాటింగ్ చేయాలి. కెప్టెన్‌గా రోహిత్ అనుభవం ఉన్నవాడు. అతను మూడు లేదా నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేయగలడు. అగ్రస్థానంలో కాకుండా.. నెం 3 లేదా 4లో బ్యాటింగ్ చేయమని శుభ్‌మన్ గిల్‌ను అడిగితే ఏమన్నా ఫీల్ అవుతాడా?. జట్టులో ఎవరికీ సొంత స్థానం ఉండదు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. జట్టు కోసం అక్కడే బ్యాటింగ్ చేస్తాడు’ అని అన్నాడు.
‘గత రెండు ప్రపంచకప్‌లలో కూడా నేను ఇదే సలహా ఇచ్చా. నేను కోచ్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో దింపడం గురించి చర్చించా. టాపార్డర్‌లో ఇద్దరు లేదా ముగ్గురు వెంటవెంటనే అవుటైన మ్యాచ్‌ల్లో మనం ఎక్కువగా ఓడిపోయాం. కాబట్టి నాలుగో స్థానంలో కోహ్లీ ఉంటే.. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయొచ్చు. నాలుగో స్థానంలో అతని బ్యాటింగ్ రికార్డులు కూడా బాగున్నాయి. నాలుగో స్థానం సమస్యకు చెక్ పెట్టాలంటే కోహ్లీని పంపడమే బెటర్’ అని రవిశాస్త్రి సలహా ఇచ్చాడు. నాలుగో స్థానంలో 55.21 సగటుతో 1767 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు ఉండటం విశేషం. రవిశాస్త్రి సలహాను కెప్టెన్ రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా? అని ఫాన్స్ చర్చిస్తున్నారు.