Leading News Portal in Telugu

జగనన్న వదిలిన బాణం రివర్స్ | jagan arrow reverse| sharmila| ysrtp| merge| congress| sister| apcc


posted on Aug 18, 2023 11:32AM

ఏపీలో జగన్ పాలన మొత్తం రివర్స్ లో సాగుతోంది. ప్రత్యర్థులపైకి విపక్షంలో ఉండగా ఆయన వదిలిన బాణం సోదరి షర్మిల కూడా ఇప్పుడు రివర్స్ అయ్యారు.  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారా అంటే నిన్న మొన్నటి వరకూ  ఏమో చెప్పలేం అన్న సమాధానమే వినిపించింది. కానీ  ఇప్పుడు  స్పష్టత వచ్చేసింది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. అలాగే విలీనం కోసం కాంగ్రెస్ విధించిన షరతులు, చేసిన ప్రతిపాదనలకు కూడా ఒకే చెప్పేశారు.  ఇప్పుడు షర్మిల పార్టీ విలీనమే   తెలంగాణ, ఏపీ రాజకీయాలలో హాట్ టాపిగ్ గా మారిపోయింది. త్వరలోనే ఈ విలీనం ప్రక్రియ పూర్తి కానుందనీ, ఆ తర్వాత షర్మిల ఏపీ రాజకీయాలలో కీలకం కానున్నారని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్యా ఈ మేరకు అంగీకరం కుదిరిందనీ, షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకారం తెలిపారనీ, ఇక మిగిలింది అధికారిక విలీనం ప్రక్రియ మాత్రమేనని, అది కూడా ఈ నెలలోనే పూర్తి అవుతుందని ఇరు పార్టీలలోని కీలక నేతలూ బాహాటంగానే చెబుతున్నారు. 

తానే అధ్య‌క్షురాలిగా మొదలైన వైఎస్ఆర్టీపీ పార్టీ మొదట్లో కాస్త దుడుకుగా కనిపించినా అది పాలపొంగులా చల్లారిపోయింది. తెలంగాణ సమాజం షర్మిలను సీరియస్ గా పట్టించుకోలేదు. అందుకే ఆ పార్టీ ప్ర‌జ‌ల్లోకి  వెళ్ల‌లేక‌పోయింది. దీంతో కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ మైలేజి బాగా పెరిగింది.   సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక  ఉపముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ రంగంలోకి దిగి షర్మిల ముందు విలీనం ప్రతిపాదన ఉంచారు.  అక్కడ నుంచి ఎన్నో చర్చలు, సందేహాలు, మలుపుల తరువాత ఆ ప్రతిపాదనకు షర్మిల అంగీకరించారు.  కాగా, షర్మిల పార్టీ విలీనం అధికారికంగా ప్రకటించిన తరువాత ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపడితే.. ఆమె తన విమర్శల వాగ్బాణానలు సంధించాల్సింది మొట్టమొదట తన  అన్న జగన్ పైనే.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేకులపై విమర్శలతో చెలరేగిపోయిన షర్మిల ఇప్పుడు తనను వదిలిన జగనన్ననే టార్గెట్ చేసుకుని పని చేయాల్సి ఉంటుంది. అదీకాక ఇప్పుడు  వైసీపీలో కనిపిస్తున్న నేతలు, కార్యకర్తలు అందరూ పాత కాంగ్రెస్ నేతలే. కనుక షర్మిల ఇప్పుడు ఏపీలో క్రియాశీలంగా మారగానే  మొదట టార్గెట్ చేయాల్సింది వైసీపీనే. యుద్ధం చేయాల్సింది అన్న జగన్మోహన్ రెడ్డితోనే. 

దీంతో షర్మిల ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే చర్చ సహజంగానే మొదలైంది. ఏపీకి వెళ్లాలా వద్దా అని నిన్న మొన్నటి వరకూ తర్జన భర్జన పడిన షర్మిల.. ఇప్పుడు ఎందుకు ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల.. జగన్ జైల్లో ఉండగా వైసీపీ పార్టీకి అన్నీ తానై నడిపించారు. ఇప్పుడు ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి అదే వైసీపీ మీద పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అన్నదే ఇప్పుడు ఇక్కడ ప్రధానాంశంగా మారింది. తన అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న షర్మిల ఇప్పుడు అదే అన్న ముఖ్యమంత్రిగా ఉండగానే  ఆయన ప్రభుత్వంపైనే దండయాత్రకు రెడీ అయిపోయారు. 

నిజానికి ఏపీకి వెళ్లడం ఇష్టం లేకనే షర్మిల కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు సాగదీశారు. కానీ, అదే సమయంలో ఏపీ ప్రభుత్వ పెద్దల నుండి, సొంత అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోటరీ నుండి వేధింపులు ఎక్కువ కావడం.. తిరిగి ఏపీ రాజకీయాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని బెదిరింపులు రావడం వంటి పరిణామాలే షర్మిలను అన్నపై పోరాటానికి సిద్దపడేలా చేశాయని వైఎస్ కుటుంబం సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో షర్మిల భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ షర్మిలకు అండగా నిలుస్తామని, అన్ని విధాలుగా సహకారం అందిస్తామనీ హామీ ఇచ్చారనీ రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే షర్మిల అన్నపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఒకప్పుడు జగనన్న వదలిన బాణాన్నీ అని జగన్ కోసం ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు అదే అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ పెద్దలు ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారని.. ఇప్పటికే నాయనా భయానా షర్మిల, విజయమ్మలను ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ చేసిన రాయబారాలు విఫలమయ్యాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.