Leading News Portal in Telugu

UAE vs NZ: అంతర్జాతీయ టీ20ల్లో ఇదే మొదటిసారి.. ఇరు జట్లు తొలి బంతికే..!


NZ and UAE Teams Lose 1st Wicket on First Ball in 1st T20: పసికూన యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. గురువారం దుబాయ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో కివీస్‌ గెలిచింది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో యూఏఈ మరో రెండు బంతులు ఉండగానే 136 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టిమ్‌ సౌథీ 5 వికెట్లతో చెలరేగాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టాడు. సౌథీ దెబ్బకు యూఏఈ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.

యూఏఈ, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ తమ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయాయి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం బహుశా ఇదే మొదటిసారి. న్యూజిలాండ్ ఓపెనర్ చాడ్ బోస్ ఇన్నింగ్స్ తొలి బంతిలో క్యాచ్ ఔట్ కాగా.. యూఏఈ ఓపెనర్ మహ్మద్ వసీమ్ ఎల్బీ అయ్యాడు. బోస్‌ను జునైద్ సిద్ధిఖీ ఔట్ చేస్తే.. వసీమ్‌ను టిమ్ సౌథీ పెవిలియన్ చేర్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో 18 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఆర్యన్ష్ శర్మ యూఏఈ తరఫున అరంగేట్రం చేశాడు. ఆర్యన్ష్ తన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 43 బంతుల్లో 60 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రం మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా అంతర్జాతీయ టీ20లో హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా ఆర్యన్ష్ నిలిచాడు. ఇక ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. టిమ్ సీఫెర్ట్ (55) సహాయంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆపై ఆర్యన్ష్ శర్మ ఆడుకున్నా యూఏఈ విజయం సాధించలేకపోయింది.