బైజూస్ పోయె.. ఎడెక్స్ వచ్చే ఢాం..ఢాం.. ఢాం | jagan government agreement with adex| on line education| byjuus| corruption| crores| rupees
posted on Aug 18, 2023 3:38PM
ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థతో చేస్తున్న ప్రయోగాలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి దోహదపడటం సంగతి అటుంచి.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసికంగా, ఆర్థికంగా నానా అగచాట్లకు గురి చేస్తున్నది. జగన్ ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెట్టి.. విద్యావ్యవస్థతో చేస్తున్న ప్రయోగాలతో రాష్ట్రంలో విద్య కుంటుపడింది. అమ్మ ఒడి వంటి పథకాలలో కోతల వల్ల అనేకమంది అర్ధంతరంగా చదువు మానేసి డ్రాప్ ఔట్ లుగా మిగిలిపోతున్నారు.
ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో విద్యాసంస్కరణల పేరిట ఆన్ లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. దీంతో హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు అందించేందుకు వీలు కలగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. ఏపీ ఉన్నత విద్యారంగంలో ఇదొక గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం జగన్ తన భుజాలను తానే చరుచుకుంటున్నారు. దాదాపుగా ఇలాంటి ఘనమైన మాటలతోనే బైజూస్ అనే సంస్థతో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది.
భారత్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ లో పిల్లలకు చదువులు చెప్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగ ముచ్చట పడింది. వెనుకా ముందూ చూడకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు ట్యాబ్ లు కూడా అందజేసింది. ట్యాబ్ లలో చదువు చెప్పేదుకు బైజూస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఆ చదువులు పిల్లలకు ఒంటబట్టలేదు. ప్రతి సంవత్సరం 8వ తరగతికి వచ్చేసుమారుఐదు లక్షల మందికి ట్యాబ్ లుఇచ్చి వారికి బైజూస్ సిలబస్ ను అందించింది. బైజూస్ ను నమ్ముకుని పిల్లలకు ట్యాబ్ లను అందించిన ప్రభుత్వం బైజూస్ పీకల్లోతు ఆక్రమాలలో మునిగి పోయి చేతులెత్తేసింది. బైజూస్ సంస్థ 28వేల కోట్ల అవినీతికి పాల్పడిందని సీబీఐ, ఈడీలు చెబుతున్నాయి.
28 వేల కోట్ల రూపాయల మేర విదేశీ పెట్టుబడులు రాబట్టి వాటిని లెక్కల్లో చూపలేదని సీబీఐ, ఈడీలు పేర్కొన్నాయి. సరే బైజూస్ అవినీతి సంస్థ కావడం వల్లనే జగన్ సర్కార్ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్ ను ఫణంగా పెట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరే బైజూస్ తో జగన్ సర్కార్ ఒప్పందం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అందు కోసం ప్రభుత్వం వ్యయం చేసిన కోట్లాది రూపాయలు గంగలో కలిపోయాయి.
ఇక ఆ తరువాతైనా విద్యావ్యవస్థతో అడ్డగోలు ప్రయోగాలకు జగన్ సర్కార్ స్వస్తి చెబుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా అంతర్జాతీయ కోర్సులు అందించడమే లక్ష్యం అంటూ జగన్ సర్కార్ పేరిట ఆన్ లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చచుకుంది. మరి ఈ ఒప్పందం భవిష్యత్ లో ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలని పరిశీలకులు అంటున్నారు.