Leading News Portal in Telugu

Child Marriages: బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలు కట్‌.. అధికారులపై చర్యలు


Child Marriages: ప్రభుత్వాలు అవగాహన కలిగించేందుకు చర్యలు చేపడుతున్నా.. ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, బాల్య వివాహాలు జరిపిస్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తామని హెచ్చరిస్తోంది ప్రభుత్వం.. అంతే కాదు.. బాల్య వివాహాలను అరికట్టడంలో విఫలమైన అధికారులపై కూడా వేటు పడుతుంది వార్నింగ్‌ ఇస్తోంది.. ఈ రోజు సచివాలయంలో ఇంటర్ డిపార్టుమెంటల్ స్ట్రాటజీ పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. ఈ సమావేశంలో బాల్య వివాహాల కట్టడిపై చర్చించారు.. ఈ సందర్భంగా సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలు రావని తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు.. ఇక, బాల్య వివాహాల నియంత్రణలో విఫలమైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

బాల్య వివాహాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ జవహర్‌రెడ్డి.. బాల్య వివాహాలు జరగకుండా ఖాజీలు, పాస్టర్లు, పురోహితులకు తగిన ఆదేశాలివ్వాలన్న ఆయన.. వివాహ రిజిస్ట్రేషన్ కు ఉన్న 60 రోజుల గడువును 6 నెలలకు పెంచే చట్ట సవరణ తెస్తాం అన్నారు. ఈ అంశంలో స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్, విద్య, ఆరోగ్య శాఖలు సమన్వంతో పని చేయాలని సూచించారు. మరోవైపు.. బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేసే స్వచ్చంధ సంస్థల సహకారం తీసుకోవాలని సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి.