Leading News Portal in Telugu

IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి టీ20.. శాంసన్‌ స్థానంలో సిక్సర్ల కింగ్‌! భారత తుది జట్టు ఇదే


IND Playing XI vs IRE for 1st T20I 2023: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. సీనియర్ ప్లేయర్స్ లేకుండానే శుక్రవారం (ఆగష్టు 18) ఆరంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరింది. భారత జట్టులోని చాలా మంది కొత్త ఆటగాళ్లే. దాదాపుగా ఈ ప్లేయర్స్ వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడలు 2023 తలపడే జట్టులోనూ ఉండనున్నారు. దాంతో ఐర్లాండ్‌తో మొదటి మ్యాచ్‌కు జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 శుక్రవారం రాత్రి 7.30కు డబ్లిన్‌ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు ధాటిగా పరుగులు చేస్తారన్న విషయం తెలిసిందే. మూడో స్థానంలో విండీస్ టీ20 సిరీస్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్‌ శివమ్‌ దుబే ఆడతాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్‌ తరపున దుబే ఆడనున్నాడు.

ఇక ఐదో స్థానంలో సంజు శాంసన్‌కు బదులుగా వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెస్టిండీస్‌పై శాంసన్‌ వరుసగా 12, 7, 13 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ల వెనుక కూడా పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో సిరీస్‌లో జితేశ్‌ను ఆడించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఐపీఎల్‌ 2023లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున జితేశ్‌ ఆకట్టుకున్నాడు. ఆసియా క్రీడల్లో జితేశ్‌ను ఆడించేందుకు మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. అతనికి అంతర్జాతీయ అనుభవం కోసం ఐర్లాండ్‌పై ఆడించొచ్చు.

యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆరో స్థానంలో అతడు బరిలోకి దిగుతాడు. ఐపీఎల్ 2023లో రింకూ 450 రన్స్ చేశాడు. 7, 8 స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ కోటాలో అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, జస్ప్రీత్‌ బుమ్రాలు ఉంటారు. ఒకవేళ సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే.. రింకు సింగ్‌, జితేశ్‌ శర్మలో ఒకరు బెంచ్‌కే పరిమితమవుతారు. చూడాలి మరి మేనేజ్‌మెంట్‌ ఎవరివైపు మొగ్గు చూపిస్తుందో.

భారత తుది జట్టు (అంచనా):
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివం దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, జస్ప్రీత్‌ బుమ్రా.