posted on Aug 19, 2023 4:44PM
అలనాటి హీరోయిన్ జయప్రద బిఆర్ఎస్ పార్టీలో చేరనుందా? ముఖ్యమంత్రి కెసీఆర్ ఆహ్వానం మేరకు త్వరలో ఆమె బిఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆమెను తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేయించకుండా మహరాష్ట్ర నుంచి పోటీ చేయించాలని కెసీఆర్ యోచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించే ఉద్దేశ్యంతో ఉన్న కెసీఆర్ మహరాష్ట్ర రాజకీయాల్లో ఫోకస్ పెట్టారు. సినీ గ్లామర్ ఉన్న నటీ నటులు ఇప్పటి వరకు బిఆర్ఎస్ లో లేరు. జయప్రద చేరికతో ఆ లోటును కొంత వరకు ఆ పార్టీ పూడ్చవచ్చు. జయ ప్రద 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొంత కాలం ఆమె టీడీపీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా, తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొనసాగారు. తర్వాత ఆమె సమాజ్ వాది పార్టీలో చేరారు. 2004,2009 ఎన్నికల్లో ఆమె సమాజ్ వాది పార్టీ తరపున రాంపూర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అమర్ సింగ్, జయప్రదలను సమాజ్ వాది పార్టీ బహిష్కరించింది. తన రాజకీయ గురువుగా భావించే అమర్ సింగ్ వెంటే జయప్రద ఉన్నారు. వీరిద్దరూ కలిసి 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ ఏర్పాటు చేసి యుపిలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 360 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేకపోయారు. 2014లో బిజ్నోర్ లోకసభ స్థానం నుంచి జయప్రద పోటీ చేసి పరాజయం చెందారు. తర్వాత ఆమె భారతీయ జనతాపార్టీలో చేరారు. జయ ప్రద నటించిన 75 బాలివుడ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలే ఆమెను బాలివుడ్ లో నిలబెట్టేలా చేసాయి. బాలివుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డును కూడా ఆమె కైవసం చేసుకున్నారు.