అప్పు దొరికితేనే కాపు నేస్తం! | kapunestam fate depends on new loan| bewareges| bonds. delhi| hilevel
posted on Aug 19, 2023 3:28PM
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తామని చెప్పి పెండింగ్ ఉన్న పథకాలు చాలా చాలా ఉన్నాయి. కొన్ని పథకాల అమలు యోచన ఇప్పటికీ జగన్ సర్కార్ చేయడం లేదు. మరికొన్ని పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా బటన్ నొక్కినా నిధులు లేక అవి మరుగున పడిపోతున్నాయి. ఇలా పెండింగ్ లో ఉన్న పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని మాత్రం రానున్న ఎన్నికలలో కీలకం కానున్నాయి. దీంతో వాటిని ఎలాగైనా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నది. కానీ తీవ్ర నిధుల కొరత, ఎంత ప్రయత్నించినా అప్పులు పుట్టని పరిస్థితిలో ఏం చేయలో తోచక జుట్టు పీక్కుంటోంది.
అలాంటి పథకాలలో అత్యంత ముఖ్యమైనది కాపు నేస్తం. ఈ పథకం అమలు చేయడం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి చావో రేవోగా మారింది. ఈ నాలుగేళ్ళలో జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసింది నిండు సున్నా. గత ప్రభుత్వంలో ప్రతిపాదించి, దాదాపు అనుమతి వచ్చిన కాపు రిజర్వేషన్లకు కూడా జగన్ గుండుసున్నా కొట్టేశారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ఆ ప్రయత్నాలు ఫలించకుండా చేసేందుకు కొట్టే వైసీపీ ఎలాగైనా కాపు నేస్తం తీసుకురావాలని చూస్తున్నది. ఇందు కోసం జగన్ సర్కార్ ఇప్పటికే ఈ నెలలో ముహూర్తం ఖరారు చేసేసింది కూడా. అయితే గత నెలలో వచ్చిన ఆదాయం, చేసిన అప్పు కూడా జీతాలు, పెన్షన్లకే సరిపోని పరిస్థితి. ఇప్పటికీ ప్రభుత్వోద్యోగులందరికీ జీతాలు అందలేదు.
దీంతో కాపు నేస్తం అమలు చేయడానికి నిధులు లేకుండా పోయాయి. దీంతో అల్పపీడనం, భారీ వర్షాల నెపంతో కాపు నేస్తం వాయిదా వేశారు. అయితే ఎక్కడా భారీ వర్షాల ఆనవాలు లేదు. అది పక్కన పెడితే బటన్ నొక్కి ఖాతాలలో సొమ్ము జమ చేయడానికి వాతావరణంతో సంబంధం ఏమిటన్న ప్రశ్నకు వైసీపీ నుంచి సమాధానమే లేదు. కాపు నేస్తం పథకం అమలుకు ఈ నెలలోనే మరో ముహూర్తం ఖరారు చేస్తామని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. అయితే ఈ నెలలో మరో ముహూర్తం ఖరారు చేసి జగన్ బటన్ నొక్కాలన్నా ఆదాయం ఎక్కడ నుంచి సమకూరుతుంది? అప్పు ఎక్కడ పుడుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. నిజానికి ఇప్పటికే ఏపీ చేయాల్సిన అప్పు కంటే రెట్టింపు చేసేసింది. కనుక ఒక్క రూపాయి అప్పు కూడా పుట్టే అవకాశం లేదు. కేంద్రం కూడా ఈ విషయాన్ని ఏపీ పెద్దలకు క్లియర్ గా చెప్పేసింది.
కానీ, ఏపీ నుండి కేంద్రానికి విన్నపాలు మాత్రం ఆగడం లేదు. గతంలో కూడా కేంద్రం ఇలాగే ఇక అప్పు కుదరదని ఖరాకండీగా చెప్పినా.. తిమాలాడుకొని, బామాలుకుని, కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని ఎలాగోలా తిప్పలు పడి అప్పులు తెచ్చింది. ప్రభుత్వం రాయతీలు తగ్గించినట్లుగా చూపించి మసిపూసి మారేడుకాయ చేసి మరీ కొత్త అప్పులు తెచ్చింది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు కూడా అందులో భాగమే. ఇప్పుడు కూడా అలాగే అనధికారికంగా అప్పుల కోసం కేంద్రం వద్ద చేతులు చాచి అడుక్కుంటోంది. ఏపీ లిక్కర్ బాండ్లను అమ్మి తమకు అప్పు ఇప్పించాలని కేంద్ర పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇక, తమకి ఏది కావాలంటే అది చేసి పెడుతున్న క్రమంలో కేంద్రం కూడా మాయ చేసో మతలబు చేసో కొత్త అప్పు ఇచ్చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.
అదలా ఉంటే.. కేవలం కొత్త అప్పుల కోసమే వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో ఒక హైలెవల్ లోన్ కమిటీని కూడా నియమించుకుంది. ఔను నిజం అనధికారికంగా ఈ అప్పుల పనులను చక్కబెట్టేందుకు ఈ కమిటీ పనిచేస్తున్నదని అంటున్నారు. అసలు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో ఏపీ ప్రజలకు తెలియదు. అయితే హస్తినలో ఉన్న ఈ హై లెవల్ లోన్ కమిటీగా చెప్పుకుంటున్న ఈ కమిటీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్నదని, ఎప్పుడు ఎంత కావాలో అంత అప్పు ఎలా సంపాదించాలో, అందుకోసం ఏం చేయాలో ఈ కమిటీ చూసుకుంటున్నదని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ ఈ కాపు నేస్తంకు కావాల్సిన నిధుల సేకరణ పనిలోనే ఉందని అంటున్నారు. ఏపీ లిక్కర్ బాండ్ల విక్రయం ద్వారా ఈ అప్పు సంపాదించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ బివరేజర్స్ బాండ్లను సబ్ స్క్రైబ్ చేయడానికి ఇన్వెస్టర్లు ముఖం చాటేశారు. మరి ఈ కమిటీ కొత్త అప్పు తెస్తుందా? జగన్ సర్కార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తుందా అంటే.. పరిశీలకుల నుంచి ఏమో చూడాలి అన్న సమాధానమే వస్తోంది.