Leading News Portal in Telugu

Ajit Agarkar: ధావన్ కాకా నీకు లేదు చోటు.. అన్ని సర్దుకో ఇక..


వన్డేల్లో అద్భుతమైన రికార్డులు సృష్టించిన టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు కెప్టెన్‌గా టీమ్ ను ముందుకు నడిపించి శిఖర్ ధావన్ చరిత్ర సృష్టించాడు. మేటి ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే, కొత్త నీరు రాగానే.. పాత నీరు పోవాలన్న చందంగా.. శుభ్ మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి యువ బ్యాటర్లు ఇచ్చిన పోటీ ముందు 37 ఏళ్ల గబ్బర్‌ నిలవలేకపోయాడు. మెరుగైన ప్రదర్శనలతో వీరిద్దరు ఓపెనర్లుగా తమ స్థానం సుస్థిరం చేసుకుంటున్న క్రమంలో ధావన్‌కు ఛాన్స్ లు కరువయ్యాయి.

అయితే.. ఇటీవల వీరిద్దరు ఫేయిల్ అవుతుండటంతో ఆసియా కప్‌-2023 రూపంలో గబ్బర్‌కు మరో అవకాశం దక్కుతుందని అతడి ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ.. బీసీసీఐ సెలక్టర్లు వాళ్ల ఆశలపై చల్లని నీళ్లు చల్లారు. ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్‌ శర్మకు జోడీగా శుభ్ మన్‌ గిల్‌ను ఎంపిక చేశారు. ఇషాన్‌ కిషన్‌కు కూడా టీమ్ లో స్థానం కల్పించారు. ఈ క్రమంలో గబ్బర్‌కు మరోసారి నిరాశే మిగిలింది. జట్టు ప్రకటన టైంలో టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. శిఖర్‌ ధావన్‌ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ లు ఎన్నో ఆడాడు. అయితే, ప్రస్తుతం.. రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లనే ఓపెనర్లుగా మా తొలి ప్రాధాన్యమని ఆయన చెప్పాడు.

ఇక, ఆసియా కప్‌ జట్టే వన్డే ప్రపంచ కప్ ప్రొవిజినల్‌ టీమ్‌ అన్న అంచనాల మధ్య శిఖర్ ధావన్‌ కెరీర్‌ ముగిసినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా బీసీసీఐపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు.. సెలక్టర్ల విషయంలో ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు.. జట్టుకు అవసరమైన టైంలో 100 శాతం కష్టపడ్డాడు అని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. గబ్బర్‌ను తలచుకుంటే బాధేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, టీమిండియా తరఫున శిఖర్‌ ధావన్‌.. 167 వన్డేలు ఆడి 6, 793 రన్స్ చేశాడు. ఇందులో17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలున్నాయి.