Leading News Portal in Telugu

Uttarakhand: మితిమీరిన వేగం.. గాల్లో ప్రాణాలు.. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి


ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం, అజాగ్రత్త డ్రైవింగ్ కారణంగా బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరకాశీ జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఏడుగురు యాత్రికులు మరణించగా, 28 మంది గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగోత్రి హైవేపై ఆదివారం నాటి ప్రమాదానికి ప్రధాన కారణం, అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ కారణమని తెలిపారు. ఈ ఘటనపై డ్రైవర్ ముఖేష్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఉత్తరకాశీ) పేర్కొన్నారు. బస్సు లోయలో పడిపోతున్న సమయంలో బస్సు వేగం అతిగా ఉందని గాయపడిన ప్రయాణికులు చెప్పారని పోలీసులు చెప్పారు.

మితిమీరిన వేగం కారణంగా వాహనాన్ని అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్‌కు సమయం లేకపోవడం, ఏమీ తోచకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ చెబుతున్నారు. ప్రమాదంపై జిల్లా మేజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారని, పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయని.. అతడు కోలుకున్నాక అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. 35 మందితో బస్సు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా బస్సులోయలో పడినట్లు పోలీసులు చెబుతున్నారు.