Rohit Sharma Gives Funny Answer to Reporters over India Squad For Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన బీసీసీఐ సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టుని ఎంపిక చేసింది. ఈ సమావేశంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ సెక్రటరీ జైషా పాల్గొన్నారు. జట్టు ఎంపిక అనంతరం ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
స్వదేశంలో ఈ ఏడాది చివరలో జరిగే ప్రపంచకప్ 2023 కోసం కూడా ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన జట్టే దాదాపుగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ 2023కి సంబంధించిన ప్రశ్నలను కూడా విలేకరులు అడిగారు. 2011తో పోల్చితే.. టాపర్డర్‌లో పార్ట్‌టైమ్ బౌలింగ్ అప్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయని కెప్టెన్ రోహిత్‌ను విలేకరులు ప్రశ్నించారు. రోహిత్ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్‌లో శర్మ, కోహ్లీ కూడా బౌలర్లకు సాయం చేస్తారు’ అని బదులిచ్చాడు. ‘మేము వారిద్దరిని బౌలింగ్ వేసేందుకు ఒప్పించాం’ అని పక్కనే ఉన్న ఛీప్ సెలక్టర్ అగార్కర్ సరదాగా పేర్కొన్నాడు. ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘అది 2011 జట్టు. అప్పుడు బౌలింగ్ చేయగల, బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉన్నారు. మనకు లభించిన దానితో సరిపెట్టుకోవాలి. ఎవరు బాగా రాణిస్తున్నారో వారికి మేము అవకాశం ఇస్తున్నాము. రాత్రికి రాత్రే బాగా బౌలింగ్ చేయగల వ్యక్తిని మనం సృష్టించలేము. ఈ కుర్రాళ్లు బాగా పరుగులు చేయగలరు. అందుకే వారు జట్టులో భాగమయ్యారు. శర్మ మరియు కోహ్లీ ప్రపంచకప్‌లో కొన్ని ఓవర్లు వేస్తారని ఆశిస్తున్నాము’ అని కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో అన్నాడు.
ఆసియా కప్ 2023కి భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ.