15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (ఆగస్టు 22) సాయంత్రం 5.15 గంటలకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఆహ్వానం మేరకు ప్రధానికి అక్కడికి వెళ్లారు. ఆగస్టు 22 నుంచి 24 వరకు అక్కడే ఉండనున్నారు. మరోవైపు ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు భారతీయ కమ్యూనిటీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ కరచాలనం చేశారు.
బ్రిక్స్ గ్రూపులో భారత్‌తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా ఉన్నాయి. 2019 తర్వాత బ్రిక్స్ నేతల ముఖాముఖి సదస్సు మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. ప్రధాని మోడీ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఇలా రాశారు, “నేను ‘బ్రిక్స్-ఆఫ్రికా ఔట్రీచ్’ మరియు ‘బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ కార్యక్రమాలలో పాల్గొంటాను. ‘గ్లోబల్ సౌత్’ మరియు ఇతర అభివృద్ధి రంగాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సదస్సు వేదికను అందిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించబడిన అనేక అతిథి దేశాలతో సంభాషించడానికి తాను ఎదురుచూస్తున్నానని మోడీ చెప్పారు. జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్న కొంతమంది నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఎదురు చూస్తున్నానని ప్రధాని చెప్పారు.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగనున్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో విదేశాంగ కార్యదర్శి క్వాత్రా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. మరోవైపు ప్రధాని దక్షిణాఫ్రికా టూర్ తర్వాత.. గ్రీక్ కౌంటర్ కైరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు ఆగస్టు 25న ఏథెన్స్‌ను సందర్శించనున్నారు. గత 40 ఏళ్లలో గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా గుర్తింపు పొందుతానని ప్రధాని మోడీ అన్నారు.