Leading News Portal in Telugu

Telangana Govt: చంద్రయాన్‌-3.. స్కూళ్ల నిర్వహణపై విద్యాశాఖ కీలక నిర్ణయం


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జూలై 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ రేపు (బుధవారం) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్‌ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 చందమామపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

రాష్ట్రంలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల కోసం లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డీఈవోలకు, ప్రిన్సిపల్స్‌కు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యా ఛానెల్స్‌ అయిన టీ శాట్‌, నిపుణలో చంద్రయాన్-3కి సంబంధించి లైవ్‌ టెలికాస్ట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్‌లు, ప్రొజెక్టర్‌లను అధికారులు రెడీ చేస్తున్నారు. రేపు (బుధవారం) సాయంత్రం 5.20 గంటల నుంచి టీ శాట్‌, నిపుణ ఛానెళ్లలో లైవ్‌ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడిపై ల్యాండ్ కానుంది.

ఇక, స్కూళ్ల సమయాన్ని పొడిగించొద్దని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఇళ్లలోనే చూడాలని చెప్పింది. ఎవరైనా చూడలేకపోతే ఎల్లుండి స్కూళ్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది. కేవలం హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో రేపు విద్యార్థులు చూసే విధంగా ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.