Leading News Portal in Telugu

PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.3000 పెంపు ?


PM Kisan Samman Nidhi: దేశంలోని రైతులకు త్వరలో గొప్ప శుభవార్తను వినే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6000 అందజేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతు కుటుంబాలకు ఇచ్చే రూ.6000ను దాదాపు 50 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఈ అమౌంట్ రూ.2000 నుంచి రూ.3000వరకు పెరగవచ్చని సమాచారం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయాలని కూడా ఆలోచిస్తోందని, దీని కింద గ్రామీణ ఆదాయం తగ్గకుండా ఉండేందుకు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్‌పీ కింద రైతుల నుంచి కొనుగోలును పెంచాలని ఆలోచిస్తోంది.

ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయం ముందు ఉంచినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఏటా రూ.20,000-30,000 కోట్ల వ్యయం ప్రభుత్వం ముందు పెరుగుతుందని అధికారి తెలిపారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది ఇంకా ఖరారు కానప్పటికీ.. నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ మొత్తం రాష్ట్ర దేశీయ ఉత్పత్తికి వ్యవసాయం సహకారం 40 శాతం కాగా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఇది దాదాపు 27శాతం. నవంబర్-డిసెంబర్ నాటికి తగినంత వ్యవసాయ జనాభా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద సహాయాన్ని పెంచినట్లయితే, ఈ రాష్ట్రాల రైతులు లాభపడవచ్చు. దీని కారణంగా ఎన్నికల్లో కూడా లాభం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పిఎం కిసాన్ యోజన కింద రైతు కుటుంబాలకు నగదు బదిలీ ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. దీనితో 85 మిలియన్లకు పైగా (సుమారు 8.5 కోట్లు) కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుంది. మహమ్మారి సమయంలో అధిక సంఖ్యలో కుటుంబాలు ఈ పథకం నుండి ప్రయోజనం పొందాయి. అయితే ఆదాయ ప్రొఫైల్, భూమి హోల్డింగ్ ఆధారంగా మినహాయింపు ప్రమాణాలు సంఖ్యను తగ్గించాయి.