posted on Aug 22, 2023 4:13PM
గన్నవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావ్.. అధికార ఫ్యాన్ పార్టీ వీడి.. సైకిల్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. ఆ క్రమంలో ఆదివారం అంటే ఆగస్ట్ 20వ తేదీ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో యార్లగడ్డ వెంకట్రావ్ భేటీ అయ్యారు.
దీంతో ఇప్పటి వరకు గన్నవరం నియోజకవర్గ వ్యవహారంపై స్తబ్దుగా ఉన్నా.. ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ అదే రోజు.. అంటే ఆగస్ట్ 20వ తేదీ.. గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఫ్యాన్ పార్టీ కీలక నేత దుట్టా రామచంద్రరావుతోపాటు అతడి కుమార్తె, అల్లుడు శివభరత్‌రెడ్డిని.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలుపించుకొని.. వారితో వైయస్ జగన్ భేటీ అయి.. వారికి భవిష్యత్తు భరోసా ఇచ్చారు.
ఈ బేటీ అనంతరం దుట్టా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలోని కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని.. త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన ప్రకటించడం.. నాయకులు వస్తుంటారు, వెళ్తూంటారు.. కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతమని.. అలాగే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. ఇక వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్‌ని గెలిపించుకొనేందుకు మనమందరం కష్టపడాలంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. తమకు వైయస్ కుటుంబంతో 45 ఏళ్లు అనుబంధం ఉందని ఈ సందర్భంగా దుట్టా గుర్తు చేసుకొన్నారు.
అయితే ఇటు యార్లగడ్డ సైకిల్ పార్టీలోకి దూకేయడం.. అటు సీఎం జగన్‌తో దుట్టా రామచంద్రరావు భేటీ కావడం.. ఈ రెండు భేటీలు ఒకే రోజు కావడం.. ఆ వెంటనే దుట్టా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాన్ పార్టీ శ్రేణులకు ధైర్య వచనాలు చెప్పడంపై పోలిటికల్ సర్కిల్‌లో ఊహాగానాలు ఊపందుకొన్నాయి.
యార్లగడ్డ వెంకట్రావ్ ఇటీవల ఆయన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్ పార్టీ అగ్రనేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం వైయస్ జగన్ అపాయింట్‌మెంటి ఇవ్వడం లేదని.. అలాగే పార్టీ స్థాపించిన నాటి నుంచి వైయస్ జగన్ కోసం కష్టపడుతోన్న దుట్టా రామచంద్రరావు లాంటి వారిని సైతం పదవులకు దూరంగా పెట్టారని….. అంతేకాకుండా వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వారం, రెండు వారాల ముందు ఫ్యాన్ పార్టీలో చేరిన.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరికి చెందిన మాజీ మంత్రి ఎం హనుమంతరావు లాంటి వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారంటూ వైయస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. మరి ఫ్యాన్ పార్టీ ఎదుగుదల కోసం కష్టపడిన దుట్టా రామచంద్రరావులాంటి వారు.. మీకు గుర్తుకు రాలేదా? అంటూ ఇదే సమావేశంలో ఫ్యాన్ పార్టీ అగ్రనేతలను యార్లగడ్డ వెంకట్రావ్ కడిగి పారేశారు.
దీంతో యార్లగడ్డ వెంకట్రావ్ సైకిల్ పార్టీలోకి వెళ్లిపోతే…. దుట్టా రామచంద్రరావుతోపాటు ఆయన వర్గం సైతం యార్లగడ్డ బాట పట్టేస్తారని సీఎం జగన్ భావించి.. తనతో భేటీ కావాలంటూ దుట్టా రామచంద్రరావుకు ఆగమేఘాల మీద ఫ్యాన్ పార్టీ అధినేత రాయబారం పంపినట్లు ఓ టాక్ అయితే పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దుట్టా రామచంద్రరావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. దీంతో దుట్టా సైతం పార్టీ మారితే.. గన్నవరంలో ఫ్యాన్ పార్టీ గెలుపు గల్లంతు అయ్యే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.
ఎందుకంటే గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట.. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆ తర్వాత ఆయన జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో గన్నవరం నుంచి గట్టి అభ్యర్థిని బరిలో దింపేందుకు టీడీపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. అలాంటి వేళ… యార్లగడ్డ సైకిల్ పార్టీలో చేరడం వల్ల… పసుపు పార్టీకి మరింత బలం చేకూరుతోందనే ఓ చర్చ సైతం నడుస్తోంది.
ఇంకోవైపు.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని.. దుట్టా రామచంద్రరావు అల్లుడు, సీఎం వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ సమీప బంధువు శివ భరత్ రెడ్డి ఆశిస్తున్నారు. గత ఎన్నికల వేళే.. దుట్టా అల్లుడు గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది సాధ్యపడలేదు. కానీ ఈ సారి ఆయన సైతం తన ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదీకాక గన్నవరం సీటు వల్లభనేని వంశీకే అని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారని ఓ చర్చ అయితే ఆ నియోజకవర్గంలో ప్రచారంలో ఉంది. మరి అలాంటి వేళ వచ్చే ఎన్నికల్లో వంశీ, శివభరత్ రెడ్డి మధ్య పోటీ ఉండే అవకాశాలు లేకపోలేదనే ఓ చర్చ సైతం వాడి వేడిగా సదరు సర్కిల్‌లో నడుస్తోంది.
ఎందుకంటే గతంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని ప్రజల్లో వల్లభనేని వంశీపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అదీ కూడా చాపకింద నీరులా ఉందనే ఓ చర్చ అయితే ఉందని… దీంతో ఎన్నికలు సమీపించగానే.. ఇదే అంశాన్ని సాకుగా చూపి… వైయస్ భారతీ సమీప బంధువు శివ భరత్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ తెరపైకి తీసుకు వచ్చినా అందులో ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో కొన.. సాగుతోంది.
మరి వచ్చే ఎన్నికల్లో అదీ.. గన్నవరం లాంటి హాట్ సీట్ కోసం టీడీపీ నుంచి యార్లగడ్డ బరిలోకి దిగితే.. ఫ్యాన్ పార్టీ నుంచి వల్లభనేని వంశీనా? లేకుంటే శివ భరత్ రెడ్డా? ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అనే అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగినా.. ఆ ఎమ్మెల్యే స్థానాన్ని ఏ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకొంటారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో మాత్రం అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది.