Samsung Working on 440 Megapixel Camera Sensors: ప్రస్తుతం ప్రముఖ మొబైల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. అందుకే ట్రెండ్‌కు తగ్గట్టు అప్‌డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అప్‌గ్రేడ్ చేస్తున్న ఫీచర్లలలో కెమెరా సెన్సార్ కూడా ఒకటి. ఫోన్ ధరను బట్టి కెమెరా క్వాలిటీని కంపెనీలు అందిస్తున్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల కోసం టాప్ మొబైల్ కంపెనీలు హై ఎండ్ కెమెరా సెన్సార్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ జాబితాలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ‘శామ్‌సంగ్’ ముందుంది. ఏకంగా 440 మెగాపిక్సెల్ కెమెరాను అందించే ప్రయత్నంలో ఉంది.
ఈ ఏడాది ప్రారంభంలో శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23), శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ (Samsung Galaxy S23+) మరియు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) మోడల్‌లు ఉన్నాయి. హై-ఎండ్ మోడల్ అల్ట్రా ఫోన్‌లో కంపెనీ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది. తాజాగా శామ్‌సంగ్ కంపెనీ 440 మెగాపిక్సెల్ కెపాసిటీతో, ఒక అంగుళం పరిమాణంలో ఉండే సెన్సార్‌లపై కొత్త బ్యాచ్ పని చేస్తోందని సమాచారం తెలుస్తోంది.
శామ్‌సంగ్ మూడు కొత్త కెమెరా సెన్సార్‌లను 2024 చివరి నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందని టిప్‌స్టర్ రెవెంగస్ అంచనా వేసినట్లు ఓ వెబ్ పోర్టల్ పేర్కొంది. 200 మెగాపిక్సెల్ HP7 సెన్సార్, 50 మెగాపిక్సెల్ GN6 (అంగుళం టైప్) సెన్సార్, 440 మెగాపిక్సెల్‌తో కొత్త HU1 సెన్సార్‌లపై శామ్‌సంగ్ పని చేస్తోందని టిప్‌స్టర్ సూచించాడు. రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు విలువైన కెమెరా అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు. 600-మెగాపిక్సెల్ రిజల్యూషన్‌తో కెమెరా సెన్సార్‌లపై పని చేయాలనుకుంటున్నట్లు కంపెనీ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా గల శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధర ఒక లక్ష్య పైనే ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,24,999గా ఉంది. 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,34,999గా ఉండగా.. 12GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,54,999గా ఉంది. 200 మెగాపిక్సెల్ ఫోన్ ధర ఇంత ఉందంటే.. 440 మెగాపిక్సెల్ ధర ఊహించడం కష్టమే. ఇక సోనీ కంపెనీ ఇప్పటికే ఒక అంగుళం టైప్ సెన్సార్ IMX 989ను డెవలప్ చేసింది. ఒప్పో ఫైండ్ X6 ప్రో, షియోమి 13 ప్రో, వివో X90 ప్రో+, షియోమీ 12S అల్ట్రా వంటి ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో దీన్ని ప్రవేశపెట్టింది.