కేంద్ర ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ కొత్త ఇన్నింగ్స్ | sachin new innings as brand ambassidor to election commission| cricket| god| hundred| international| centuries| voter
posted on Aug 23, 2023 5:04PM
బూస్ట్, అనాకాడెమీ, క్యాస్ట్రోల్ ఇండియా ఎయిర్టెల్, బీఎండబ్ల్యూ, ఫియట్ పాలియో, లుమినస్ ఇండియా, సన్ఫీస్ట్ బ్రిటానియా, బజాజ్ అమిత్ ఎంటర్ప్రైజ్.. ఏమిటీ జాబితా అనుకుంటున్నారా? ఇవన్నీ దిగ్గజ సంస్థలు. దాదాపుగా దేశ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైనే. ఇప్పుడు ఈ జాబితాలోకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిపోయింది. అసలింతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటారు? ఉండడి అక్కడికే వస్తున్నాం.
కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కుపై ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చి వారిలో అవగాహన పెంపొందించేందుకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ను నియమించుకుంది. ఆ బ్రాండ్ అంబాసిడర్ వేరెవరో కాదు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. ఔను వంద సెంచరీల దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కరే. సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసి దశాబ్ద కాలం దాటి పోయింది. అయినా నేటికీ ఇండియన్ క్రికెట్.. ఒక్క ఇండియన్ క్రికెట్ అనేమిటి ప్రపంచ క్రికెట్ గురించి ప్రస్తావించాలంటే మొదటిగా ఎవరికైనా స్ఫురించే పేరు సచిన్ టెండూల్కర్ మాత్రమే. ఈ సచినుడు అనితర సాధ్యం అన్న చందంగా ఏకంగా వంద శతకాలు బాదేశాడు. ఇవన్నీ అంతర్జాతీయ మ్యాచ్ లలో చేసినవే. ఇవి కాక కౌంటీ క్రికెట్ లో పారించిన పరుగుల వరద అదనం. అటువంటి సచిన్ టెండూల్కర్ కు ఇప్పుడు సీఈసీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇంతకు ముందు పైన చెప్పుకున్న దిగ్గజ సంస్థలన్నిటికీ కూడా సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. వాటిలో కొన్నిటికి ఇప్పటికీ సచినే బ్రాండ్ అంబాసిడర్ అందుకే ఆ దిగ్గస సంస్థల జాబితాలోకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిందని చెప్పొచ్చు.
భారత ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ బుధవారం ( ఆగస్టు 23) బాధ్యతలు చేపట్టారు. రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం లక్ష్యంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఓటింగ్ పై అర్బన్ ఓటర్లు, యూత్ ఒకింత నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారిలో అవగాహన పెంచి ఒటింగ్ దిశగా వారిని నడిపించేలా అవగాహన కల్పించేందుకు సచిన్ టెండూల్కర్ నడుంబిగించనున్ననారు.
భారత ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ మూడేళ్ల పాటు ఉంటారు. “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అటువంటి దేశంలో ఓటర్లు బాధ్యతగా ఓటేయాలి అని సచిన్ సీఈసీ బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పేర్కొన్నారు.