Leading News Portal in Telugu

Kadiyam Srihari: నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తా..


స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీ కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేను అని అన్నారు. 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన.. కానీ, అవినీతికి పాల్పడలేదు.. ఎవరైనా అవినీతి చేశాడని నిరూపిస్తే నేలకు ముక్కు రాస్తానని కడియం అన్నారు.

ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు పరిచయం చేస్తాను అని ఎమ్మెల్సీ కడియం శ్రీహారి పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్యల సహకారం తీసుకుంటాను ఆయన వెల్లడించారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తా అని చెప్పారు. డబ్బు సంపాదించడం కోసం రాజకీయాన్ని ఉపయోగించుకోను అని కడియం తెలిపారు.

నాకు స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక అభివృద్ధి ప్రణాళిక ఉంది అని ఎమ్మెల్సీ కడియం శ్రీహారి అన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కడియం మార్క్ చూపిస్తానని ఆయన వ్యాఖ్యనించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది.. కేసీఆర్ పైన ప్రజలలో విశ్వాసం ఉంది.. దానికి నిదర్శనమే ఈ భారీ సభ అన్నారు. నిన్నటి వరకు వేరు.. ఇప్పుడు వేరు.. నాకు అందరూ సమానమే.. పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వెళ్లాను.. కానీ, వారు అందుబాటులో లేరు అని కడియం అన్నారు. రాజయ్య సహకారం ఈ నియోజకవర్గంలో నాకు చాలా అవసరం ఉంది అని ఎమ్మెల్సీ శ్రీహారి చెప్పుకొచ్చారు.