Leading News Portal in Telugu

IND vs IRE: మూడో టీ20లో వరుణుడిదే విజయం.. సిరీస్ భారత్‌ సొంతం!


IND vs IRE 3rd T20 Match abandoned without a ball bowled: భారత్, ఐర్లాండ్ మధ్య బుధవారం జరగాల్సిన మూడో టీ20లో వరణుడు విజయం సాధించాడు. టాస్ కూడా పడకుండానే మూడో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దాంతో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్‌.. 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. మరోవైపు ఐర్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా మూడో టీ20 సిరీస్‌ విజయం కావడం విశేషం. ఇక టీమిండియా ఆసియా కప్ 2023 ఆడేందుకు సిద్ధంగా ఉంది. ఆగష్టు 30న ఆసియా కప్ ఆరంభం కానుంది.

బుధవారం డబ్లిన్‌లో వర్షం తెరిపినివ్వకపోవడంతో మూడో టీ20లో టాస్‌ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మ్యాచ్‌ ఆరంభ సమయం నుంచి మూడు గంటల తర్వాత వాన తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించారు. అయితే మైదానం చిత్తడిగా ఉండడంతో కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ కూడా సాధ్యం కాదని తేల్చేశారు. ఐర్లాండ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్‌ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7.30 ఆరంభం కావాల్సి ఉండగా.. 11 గంటల ప్రాంతంలో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

తొలి టీ20 కూడా వర్షం కారణంగా మధ్యలోనే ఆగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 2 పరుగుల తేడాతో నెగ్గింది. రెండో టీ20లో బుమ్రా సేన 33 పరుగుల తేడాతో గెలిచింది. 11 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన బుమ్రా.. బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టడం ఈ సిరీస్‌లో భారత్‌కు అతి పెద్ద సానుకూలాంశం. ఆసియా కప్ 2023, ప్రపంచకప్ 2023 ముందు బుమ్రా ఫామ్ అందుకోవడం సంతోషించే విషయం.