Leading News Portal in Telugu

Medical And Health Department: ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.. సీఎం ఆదేశాలు


Medical And Health Department: వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆరోగ్య శ్రీ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించిన ఆయన.. విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధం కావాలన్నారు. సమగ్ర వివరాలతో బుక్‌లెట్ అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ రంగంలోని మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండాలని స్పష్టం చేశారు. నిర్వహణకు నిధులు సమస్య రాకుండా ఒక విధానం తీసుకు రావాలన్నారు. ప్రభుత్వం విద్యా సంస్థలకు ఇచ్చే ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బుల్లో కూడా కొంత ఆయా సంస్థల నిర్వహణకు వినియోగించేలా ఒక విధానం తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌..

మరోవైపు ఈ ఏడాది విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలోని ఐదు మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతాయని వెల్లడించారు.. ఇక, పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్‌, మదనపల్లె మెడికల్‌ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.