Leading News Portal in Telugu

విశాఖ ఎంపీ సీటు యమా హాటు గురూ! | visakha mp seat very hot| all| parties| eye. contest| ycp| bjp| tdp


posted on Aug 24, 2023 1:35PM

ఏపీలో ఇటు రాజకీయంగా.. అటు పాలనా పరంగా హీటెక్కిస్తున్న నగరం విశాఖ. అధికారికంగానైనా.. అనధికారకంగానైనా విశాఖ నుండి పాలన సాగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి మొండిగా ఉన్నారు. విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా మార్చాలని చూస్తున్నా..  కోర్టులలో బ్రేకులు పడుతుండటంతో కనీసం తానైనా పరిపాలన అక్కడ నుండి సాగించేందుకు రెడీ అయిపోతున్నారు. ఇందుకోసం అక్రమార్గంలో ఇక్కడ భవనాల నిర్మాణం కూడా మొదలెట్టేశారు.

వైసీపీ ప్రభుత్వం రాజధానిగా విశాఖ అనే ప్రకటన అనంతరం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం,  కబ్జాలు, రౌడీయిజం, గుండాయిజం కూడా విజృంఖలంగా విస్తరించింది. సాక్షాత్తు ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసి ఒక రోజంతా ముప్పతిప్పలు పెట్టి విడిచిపెట్టారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో ఇట్టే అవగతమౌతుంది. మరోవైపు గంజాయి వాడకంలో కూడా విశాఖ వేగంగా తొలి స్థానానికి చేరుకుంటోంది.  విశాఖలో దిగజారుతున్న పరిస్థితులపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు రాజకీయంగా కూడా విశాఖ హాట్ సీట్ గా మారిపోయింది

రాజధాని తెస్తాం, ఇస్తామని అధికార పార్టీ విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటే.. విశాఖలో పెరిగిన కబ్జాలు, రౌడీయిజం, ధ్వంసమవుతున్న ప్రకృతిని ప్రతిపక్షాలు హైలైట్ చేస్తున్నాయి. దసరా నుండి విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పరిపాలన చేయాలని ఆరాటపడుతుంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ పర్యటనలు, యాత్రలు చేపడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. చంద్రబాబు తాజాగా విశాఖలో విజన్ 2047 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేయడమే కాకుండా.. విశాఖ వీధుల్లో ర్యాలీ కూడా నిర్వహించారు. ఇండియా అభివృద్ధికి ఏం చేయాలో మేధావుల మాటగా చెప్పిన చంద్రబాబు పనిలో పనిగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన నష్టాన్ని అక్కడి ప్రజలకు వివరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తన మూడవ విడత వారాహీ యాత్రలో భాగంగా విశాఖ సహా ఉత్తరాంధ్రను చుట్టేశారు. టీడీపీ, జనసేన రుషికొండపై అక్రమ తవ్వకాలు, కట్టడాల నిర్మాణంపై తీవ్రంగా వైసీపీని టార్గెట్ చేసి ఏకిపారేశారు.

 తన తల్లి విజయమ్మను ఓడించిన విశాఖలో ఎలాగైనా జెండా ఎగరేయాలని సీఎం జగన్ ఆశపడుతుంటే.. టీడీపీ తన సత్తా చాటుకొని విశాఖ రాజధాని సిద్దాంతం తప్పని నిరూపించాలని చూస్తున్నది. సామజికంగా  కలిసి వచ్చే అవకాశం ఉండడంతో జనసేన ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని చూస్తుండగా.. ఏపీ మొత్తం మీద బీజేపీకి ఎంతో కొంత కలిసి వచ్చే స్థానం ఇదే కావడంతో బీజేపీ కూడా  ఇక్కడ తిష్టవేసి వ్యవహారం నడిపించాలని చూస్తున్నది. ఇది కాకుండా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు చాప కింద నీరులా స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీచేసి తమ ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు.  

ప్రస్తుతం విశాఖ సిట్టింగ్   ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ. వ్యాపార వ్యవహారాలలో ఈయన కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేసి ఒక రోజంతా కస్టడీలో ఉంచుకున్నారు. ఆ తర్వాత పెద్దగా రాజకీయాల జోలికి రాని ఎంపీ మకాం కూడా హైదరాబాద్ కు మార్చనున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు మరోసారి రేసులో ఉంటారా ఉండరా అన్నది తేలాల్సి ఉంది. ఎంవీపీ అలా డైలమాలో ఉండడంతో  విజయసాయి రెడ్డి తన అల్లుడిని నిలబెట్టాలన్న యోచనలో ఉన్నారు. వాస్తవానికి అల్లుడి కోసమే కొన్నేళ్లుగా విజయసాయి ఇక్కడ రాజకీయ పునాది వేశారని వైసీపీలో టాక్ మొదలైంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుండి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల అధిపతి భరత్ మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిన భరత్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారని టీడీపీ క్యాడర్ గట్టిగా భావిస్తుంది.

జనసేన కూడా ఈ సీటు మీద మక్కువ చూపిస్తుంది. ఆ పార్టీ నుంచి విశాఖ సీనియర్ లీడర్ 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ బరిలోకి దిగుతారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు రెండు లక్షల ఎనభై వేల ఓట్లు రాగా ఈసారి గట్టిగా ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉంటుందని జనసేన నమ్ముతున్నది. మరోవైపు ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ కూడా ఈ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది.  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచి  పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె విశాఖ ఎంపీగా 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు.  జనసేన, బీజేపీ కలిసి టీడీపీతో పొత్తుకు వెళ్తే ఈ సీటు ఎవరు దక్కించుకుంటారన్నది మరింత ఆసక్తి కరం.  మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎంపీ సీటుపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.