టీమిండియా యంగ్ బౌలర్ యుజువేంద్ర చహల్‌కు జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. గత కొంతకాలంగా అతడు నిలకడలేమి ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో.. కుల్దీప్ యాదవ్.. తనకు వచ్చిన ఛాన్స్ ను ఒడిసి పట్టుకున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతూ జట్టుకు అవసరమైన టైంలో రాణిస్తున్నాడు. అయితే, చహల్‌ను కాదని సెలక్టర్లు కుల్దీప్ను ఎంపిక చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా తెలిపాడు. ఆసియా కప్-2023కి ఎంపిక చేసిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ చహల్‌కు స్థానం ఇవ్వకపోవడమే మంచిదైందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజీ చహల్‌కు సెలక్షన్ కమిటీ మొండిచేయి చూపించింది.
చహల్ ను కాదని మరో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపింది బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు చోటు లేదని.. ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి చూడలేమని ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా.. ఆసియా కప్ జట్టు జాబితా నుంచే వన్డే వరల్డ్‌కప్‌కు ప్లేయర్స్ ను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో.. కుల్దీప్ మెరుగ్గా రాణిస్తే ఐసీసీ ఈవెంట్‌పై కూడా చహల్ ఆశలు వదులుకోవాల్సిందేనని క్లారిటి ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా సునీల్ గావాస్కర్ లాంటి దిగ్గజాలు చహల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్పిన్నర్లలో చహల్‌ను మించిన మరో ఒకరు లేరని అన్నారు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాత్రం బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు కామెంట్స్ చేయడం గమనార్హం. కాగా, ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబరు 2న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.