జగన్ పార్టీ పనైపోయింది.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడి!? | mood of the nation survey gives tdp 15loksabha seats| jagan| party| graph
posted on Aug 25, 2023 2:42PM
గత వారం ఐ ప్యాక్ చేసిన ఓ సర్వే లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది లీక్ కాబట్టి వైసీపీ నేతలు అది ఫేక్ అంటూ పెద్ద గొంతు పెట్టుకుని అరిచి చెప్పారు. కానీ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే చానల్ ప్రకటించిన సర్వే తాజాగా వెలువడింది. ఆ సర్వే కూడా వైసీపీ డిక్లైన్ ను విస్పష్టంగా తేల్చేసింది.
ఇండియా టుడే చానల్ ప్రతి ఆరు నెలలకోసారి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వేలు వెలువరిస్తుంది. తాజా సర్వేలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కనీసం పదిహేను లోక్ సభ సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని విస్పష్టంగా పేర్కొంది. ఈ సర్వే కేవలం లోక్ సభ సీట్ల గురించే చెప్పింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలుగుదేశం ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉంటుందని, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీగా ఉండబోయేది తెలుగుదేశం మాత్రమేనని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కుండబద్దలు కొట్టేసింది.
ఈ సర్వేపై తమకు విశ్వాసం లేదని వైసీపీ చెప్పుకునే అవకాశం ఇసుమంతైనా లేదు. ఎందుకంటే ఇదే ఇండియా టుడే.. ఏడాది కిందట నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి కేవలం ఏడు లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. అప్పుడు వైసీపీ శ్రేణులు, నాయకత్వం ఆ సర్వేను ఓన్ చేసుకుని ఎన్నికల నాటికి తెలుగుదేశం సీట్లు మరిన్ని తగ్గిపోతాయనీ, పాతికకు పాతిక లోక్ సభ స్థానాలూ తమ ఖాతాలోనే పడతాయని ప్రకటనలు గుప్పించాయి. దాని ప్రాతిపదికగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైనాట్ 175 అంటూ లోక్ సభ స్థానాలలాగే అసెంబ్లీ స్థానాలనూ వంద శాతం గెలుచుకుంటామని చెప్పారు. ఆ తరువాత ఇప్పటి వరకూ ఆ వైనాట్ 175 మంత్రాన్నే వల్లె వేస్తూ వస్తున్నారు.
ఆరు నెలల కిందట ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి పది లోక్ సభ స్థానాలను ఇచ్చింది. ఇప్పుడు తాజా సర్వేలో ఆ సంఖ్య 15కు పెరిగింది. అయితే ఈ సర్వేకు సంబంధించి ఒక్క విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే పొత్తుల ప్రశక్తి లేకుండా నిర్వహించిన సర్వే. అంటే పొత్తులు లేకుండానే తెలుగుదేశం పార్టీ పాతిక లోక్ సభ స్థానాలలో 15 గెలుచుకుంటుంది. ఐ ప్యాక్ సర్వేలో కూడా అదే చెప్పింది. ఇటీవల టైమ్స్ నౌ చానల్ తో.. ప్రతీ నెలా ఓ సర్వే వస్తోంది. అందులో ఇరవై ఐదు సీట్లూ వైసీపీకే వస్తాయని వేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లోనూ వైసీపీ పట్టు జారిపోయిదని స్పష్టమయింది. తమ సిట్టింగ్ పంచాయతీలు, కంచుకోటల్లోనే ఓడిపోయింది. పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతోంది.
ఈ క్రమంలో జగన్ రెడ్డి గ్రాఫ్ దారుణంమగా కరిగిపోతోంది. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. రాష్ట్రంలో దిగజారుతున్న జగన్ గ్రాఫ్ ను బట్టి చూస్తే ఎన్నికల నాటికి వైసీపీ కనీసం ఒక్కటంటే ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారినా ఆశ్చర్యం లేదని పరిశీలకలు అంటున్నారు.