Leading News Portal in Telugu

Visakhapatnam: హడలిపోతున్న వైజాగ్‌ వాసులు.. అది చిరుతా..? అడవి పిల్లా..?


Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో చిరుతల సంచారంతో హడలిపోతున్నారు ప్రజలు.. తిరుమలలో చిరుతల సంచారం భక్తులను భయపెడుతుండగా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తుండడంతో రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ప్రజలు.. చిరుతల సంచారంతో చివరకు అడవి పిల్లులను చూసినా జనం హడలెత్తిపోతున్నారు. తాజాగా, విశాఖ నగరం పరిధిలోని ఎండడాలో చిరుతను చూసినట్టు ఓ భవనం వాచ్ మెన్ చెప్పడం కలకలం రేపింది. ఎంకే గోల్డ్ అపార్ట్ మెంట్స్ వెనుక చిరుత సంచరిస్తున్నట్టు వాచ్ మెన్ గణేష్ చెప్పాడు.. దీంతో, ఆ ప్రాంత వసుల్లో టెన్షన్‌ మొదలైంది.. అయితే, స్థానికుల సహకారంతో ఫారెస్టు అధికారుల దృష్టికి సమాచారం వెళ్ళింది. దీంతో, కంబలా కొండ అభయారణ్యం పర్యవేక్షణ చూస్తున్న సిబ్బంది.. చిరుత సంచరిస్తున్నట్టు అనుమానిస్తున్న ప్రాంతాన్నీ పరిశీలించారు. చిరుత సంచారంకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదని తేల్చారు. అయితే, అడవి పిల్ల జాతికి చెందిన జంతువు వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు ఫారెస్ట్‌ అధికారులు.