ఈ సారి మంగళగిరి చినబాబుదే! | chinababu win sure in mangalagiri| nara| lokesh| strengthen| rk| chiranjeevi| ycp| anti
posted on Aug 25, 2023 8:38PM
తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విజయం ఈ సారి నల్లేరుమీద బండినడకే అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. నారా లోకేష్ కూడా మరోసారి మంగళగిరి నుండే పోటీ చేస్తా.. గెలిచి తీరుతా కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. అయితే అదే సమయంలో వైసీపీ నుండి మాత్రం తమ పార్టీ విజయంపై ఇసుమంతైనా ధీమా వ్యక్తం కావడం లేదు.
మరోసారి లోకేష్ ను ఓడిస్తాం అని ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణారెడ్డి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. మరోసారి మంగళగిరిలో విజయం మాదే అంటూ వైసీపీ నుండి ప్రకటనలు లేవు. దీంతో అసలేం జరుగుతోంది? మంగళగిరిలో ఈసారి ప్రజల మూడ్ ఎలా ఉండబోతుంది? టీడీపీ ధీమాకి కారణం ఏంటి? వైసీపీ మౌనం వెనుక ఉన్న భయం ఏమిటి? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి 2014, 2019లలో రెండు సార్లు మంగళగిరి నుంచి గెలిచారు. 2014లో జస్ట్ 12 ఓట్ల తేడాతో బయటపడిన ఆర్కే 2019లో నారా లోకేష్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజానికి ఈ మెజారిటీ కూడా అంత గొప్పదేమీ కాదు. ఎందుకంటే రాష్ట్రమంతా చంద్రబాబు వేవ్ కనిపిస్తున్న 2014 ఎన్నికలలో గెలిచిన ఆర్కే.. 2019 జగన్ వేవ్ లో కూడా జస్ట్ 5 వేల మెజార్టీ అంటే అది అతిపెద్ద గెలుపేమీ కాదు. మరి ఈసారి ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఆర్కే అక్కడ విజయం సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకవైపు ప్రభుత్వంపై అసంతృప్తితో పాటు ఆర్కేకు కూడా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ మరోసారి ఆర్కేకు మంగళగిరిలో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేదని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మంగళగిరి నుండి ఈసారి ఆర్కేను తప్పించడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.
మరి ఆర్కేను తప్పిస్తే ఇక్కడ నుండి లోకేష్ మీద పోటీ చేసే నాయకులెవరు? దీనికి వైసీపీ వర్గాల నుండి రెండు మూడు అప్షన్లు వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ నుంచి ఆర్కేపై పోటీ చేసి.. ఆ తర్వాత వైసీపీలో చేరిన గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల్లో ఒకరిని మంగళగిరి బరిలో దించేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ముగ్గురిలో గంజి చిరంజీవికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఒడి పోయడం అంటే అంతో ఇంతో ప్రజలలో చిరంజీవికి పట్టు ఉన్నట్లునని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. కనుక చిరంజీవినే నారా లోకేష్ పై పోటీకి దింపడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే జరిగితే లోకేష్ కు గెలుపు అవకాశాలు ఎక్కువ.
ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు అమరావతి నాశనం ప్రభావం ఈసారి ఎన్నికలలో స్పష్టంగా కనిపించే ఛాన్స్ ఉంది. దీనికి తోడు మంగళగిరిలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కక్ష పూరిత పాలన కూడా ఇక్కడ ప్రజలకు విరక్తి పుట్టించింది. ఆర్కే పుణ్యమా అని సీఎం సొంత సామాజిక వర్గం కూడా ఇక్కడ గుర్రుగా ఉందని తెలిసింది. సర్వేల్లోనూ వైసీపీకి ఇక్కడ ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు గంజి చిరంజీవిని తీసుకొచ్చినా పార్టీ ఆయన్ని అభ్యర్థిగా ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తుందన్నది అనుమానమే. ఆర్కేను పక్కకి పెడితే ఆయన వర్గం చిరంజీవికి మద్దతు ఇవ్వడం కూడా అనుమానమే.
మరో వైపు ఇక్కడ లోకేష్ గతాన్ని మించి బలోపేతం అయ్యారు. ఆయన నడత నుండి రాజకీయం వరకూ అన్నీ మారాయి. సొంత నియోజకవర్గంపై ఈసారి లోకేష్ మరింత గురి పెట్టనున్నారు. టీడీపీ అధిష్టానం కూడా ఈసారి మంగళగిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పటికే ఇక్కడ పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతలను చంద్రబాబు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు అప్పగించారు. త్వరలోనే గ్రామా స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి ఒక్క నాయకుడితో లోకేష్ వ్యక్తిగతంగా కలిసే ప్రణాళిక రచించనున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.