Leading News Portal in Telugu

Rahul Gandhi: కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద రాహుల్ గాంధీ నివాళులు


Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ని సందర్శించి 1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ ఒక ప్రదేశం మాత్రమే కాదన్న రాహుల్‌గాంధీ.. ఇది పరాక్రమమని అభివర్ణించారు. వీరసైనికుల ధైర్యం, త్యాగంతో ప్రతిధ్వనించే భూమి ఇది అని ఆయన పేర్కొన్నారు. ఇది భారతదేశానికి గర్వకారణమని.. భారతీయులందరూ దేశం పట్ల తమ బాధ్యతను నిర్వర్తించారన్నారు. కార్గిల్ యుద్ధంలో వీర జవాన్లు, అమరవీరులందరికీ నమస్కరిస్తున్నానని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

భారత్‌, పాకిస్తాన్ మధ్య 1999 కార్గిల్ యుద్ధానికి గుర్తుగా ద్రాస్ పట్టణంలో నిర్మించిన స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తున్న అనేక చిత్రాలను రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించే ముందు రాహుల్‌ గాంధీ తన తొమ్మిది రోజుల లడఖ్ పర్యటనను కార్గిల్‌లో బహిరంగ సభతో ముగించారు. ఆయన కారులో కాశ్మీర్‌కు వెళ్లే ముందు ద్రాస్‌లోని స్థానిక నివాసితులను కూడా కలిశారు. బహిరంగ సభలో చైనాతో సరిహద్దు వివాదంలో కేంద్రం వైఖరిపై ఆయన మండిపడ్డారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న విషయం స్పష్టమని.. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ఖండించడం బాధాకరమన్నారు.

రాహుల్ గాంధీ ఆగస్టు 17న రెండు రోజుల పర్యటన నిమిత్తం లేహ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తన బసను ఒక వారం పాటు పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లోని దాదాపు అన్ని ముఖ్యమైన ప్రదేశాలను తన మోటార్‌సైకిల్‌పై పర్యటించారు. ఆయన లేహ్ నుంచి పాంగోంగ్ సరస్సు, నుబ్రా, ఖర్దుంగ్లా టాప్, లమయూరు, జన్స్కార్, కార్గిల్ వరకు బైక్‌పై వెళ్లాడు. శనివారం తల్లి సోనియా గాంధీని రాహుల్‌గాంధీ కలుసుకోనున్నారు.