అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అందులో అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల వయస్సును నిర్దేశించారు.
ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000 అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు చేయనున్నారు. దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ముందుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
అంతేకాకుండా అంగన్‌వాడీలకు తెలంగాణలోనే అత్యధిక వేతనాలు ఇస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడుసార్లు అంగన్‌వాడీల వేతనాల పెంపు చేశారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ కు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంగన్వాడీలకు అరకొరగా జీతాలు ఇస్తున్నారని మంత్రి ఆరోపించారు.