Leading News Portal in Telugu

Supreme Court: బ్యాడ్మింటన్‌ ఆడుతున్న లాలూకు బెయిల్ ఎందుకు?.. సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ


Supreme Court: దాణా కుంభకోణం కేసులో వైద్య కారణాలతో బెయిల్‌ పొందిన ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ బ్యాడ్మింటన్‌ ఆడుతున్నారని, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రికి మంజూరైన ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. లాలూ ప్రసాద్ యాదవ్ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఆయన ఇటీవలే లాలూ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారని, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తిరిగి జైల్లోకి పంపేందుకు కేంద్ర ఏజెన్సీ కుట్ర చేస్తోందని వాదించారు.

దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు స్పందిస్తూ.. ఇటీవల లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బ్యాడ్మింటన్‌ ఆడిన వీడియోలు వైరల్‌ అయ్యాయని, ఒక వేళ ఆయన అనారోగ్యంతో ఉంటే బ్యాడ్మింటన్‌ ఎలా ఆడుతారని ప్రశ్నించారు. అంతేకాకుండా పలు రాజకీయ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరైన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం న్యాయస్థానానికి విన్నవించారు. వాదనలు విన్న కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని లాలూ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. వాదనలు విన్న ధర్మాసనం దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా లాలూ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. సీబీఐ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 17గా నిర్ణయించింది.

జూలై 28న లాలూ యాదవ్ బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియో తెరపైకి రావడం గమనార్హం. ఈ వీడియో ఆధారంగా సుప్రీంకోర్టులో లాలూ వాదనను కేంద్ర ఏజెన్సీ వ్యతిరేకించింది. ఆర్జేడీ అధినేత లాలూ కొన్ని నెలల క్రితం సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి తన కిడ్నీలో ఒకదానిని ఆయనకు దానం చేశారు. ఆ ఆపరేషన్‌ తర్వాత లాలూ కోలుకున్నారు. ఇటీవల విపక్షాల ఉమ్మడి కూటమి సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.