Student dies after Scorpion sting in Class Room: క్లాస్ రూమ్‌లో తేలు కుట్టి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చిత్తు పేపర్లు ఏరుతుండగా తేలు కుట్టడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలిస్తుండగా రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడు. దాంతో విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన వై ప్రసాద్, శ్రీదేవిల చిన్నకుమారు అభిలాష్ (14). తండ్రి ప్రసాద్ వలస కూలీగా వరంగల్‌లో పని చేస్తున్నాడు. తల్లి ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటోంది. అభిలాష్ తన తాతయ్య వద్ద ఉంటూ.. వాకతిప్ప జడ్పీహెచ్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో చిత్తు రేపర్లు ఎక్కువగా ఉండటంతో.. మరో విద్యార్థితో కలిసి వాటిని ఏరుతుండగా అభిలాష్ ఎడమ చేతికి తేలు కుట్టింది.
విషయం తెలిసిన జడ్పీహెచ్ ఉపాధ్యాయులు అభిలాష్‌ని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఊపిరితిత్తుల్లోకి విషం చేరడంతో.. అభిలాష్ రక్తపు వాంతులు చేసుకుని మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై తెలిపారు. ఈ విషాదంతో అభిలాష్ కుటుంబం, తోటి విద్యార్థులు శోకసముద్రంలో మునిగిపోయారు.