Leading News Portal in Telugu

వామ్మో.. గవర్నర్, కేసీఆర్ మధ్య ఇంత సయోధ్యా? | reconciliation between governer and cm| tamilisye| kcr| secrateriat| patnam| swornin


posted on Aug 26, 2023 6:24AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడుటలో సిద్ధహస్తులు. ఉద్యమ నేతగా ఉన్నప్పటి నుంచీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లుగా ఆయనను తెలిసిన వారంతా రెండో ఆలోచన లేకుండా ఈ మాట చెబుతారు. తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ ( అప్పుడు టీఆర్ఎస్)ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ప్రకటించడం నుంచి.. దళితులకు మూడెకరాల భూమి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడు వరకూ ఆయన అవసరార్ధం ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ పబ్బం గడవగానే వాటిని విస్మరించారు. అయితే ఆయన వాగ్ధాటి, మాటల మాయాజాలం కారణంగా ఆయన వాగ్దాన భంగాలు ప్రజలకు పెద్దగా గుర్తుండవు. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ తమిళసై పై ఎక్కడ లేని గౌరవాభిమానాలూ ప్రదర్శిస్తున్న సీఎం కేసీఆర్ గత మూడేళ్లుగా ఆమెకు ప్రోటాకాల్ ఇవ్వడం నుంచీ ప్రతి విషయంలోనూ ఆమెను విస్మరించారు. పక్కన పెట్టారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ  ఆ వ్యవస్థలు మరింత మెరుగ్గా పటిష్టంగా పని చేయడానికి దోహదపడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుంది.  కానీ ఆ ఘర్షణ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే మాత్రం ఆ వ్యవస్థలు భ్రష్టు పట్టడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించదు.

తెలంగాణలో గత మూడేళ్లుగా అదే జరిగింది. జరుగుతోంది. అవసరార్దం తప్ప ప్రభుత్వం రాజ్ భవన్ ను పట్టించుకోవడం లేదు. ఈ వివాదం ముదిరి ఎంత వరకూ వెళ్లిందంటే.. రాజ్ భవన్, తెరాస సర్కార్ విభేదాలు  హస్తిన చేరాయి. స్వయంగా గవర్నర్ తమిళసై తెరాస సర్కార్ తీరుపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. విలేకరుల సమావేశంపెట్టి మరీ తనను కేసీఆర్ సర్కార్ అవమానిస్తున్నదంటూ.. విమర్శలు గుప్పించారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు.ప్రతిగా మంత్రులూ మీడియా ముందుకు వచ్చారు. రాజ్ భవన్ బీజేపీ కార్యాలయంగా మారిపోయిందంటూ ఎదురుదాడికి దిగారు. తెలంగాణ గవర్నర్ తమిళిశై, సీఎం కేసీఆర్‌ మధ్య సయోధ్యలేదన్న విషయం రహస్యమేమీ కాదు.   ఆమెను గవర్నర్ గా అవసరమైనప్పుడు మాత్రమే గుర్తిస్తారు. మరే సందర్భంలోనూ ఆమెకు ప్రోటోకాల్ కూడా ఇవ్వరు.

వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు  ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం  ఎంతమాత్రం అభిలషణీయం కాదు.   ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే,  అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం కూడా తగ్గేదేలా అన్నట్లుగా పరస్పర విమర్శలతో బహిరంగ రచ్చకు ఎంత మాత్రం వెనుకాడని పరిస్థితి నిన్న మొన్నటి వరకూ నెలకొని ఉంది. ఇరువురి మధ్యా విభేదాల కారణంగా రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయం కోర్టు వరకూ వెళ్లింది.   అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య అగాధంపై కోర్టు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. అప్పట్లో విభేదాలన్నీ సమసిపోయి ఆల్ ఈజ్ వెల్ అన్న వాతావరణం కనిపించినా.. తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక తాజాగా మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలున్నాయా అనిపించేలా వాతావరణం మారిపోయింది. పట్నం ప్రమాణ స్వీకారోత్సవం తరువాత కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో ముఖాముఖీ చర్చలు జరిపారు.

ఆ మరుసటి రోజే గవర్నర్ ను సచివాలయ సందర్శనకు ఆహ్వానించారు. సచివాలయంలోకి ఆమెను స్వయంగా తోడ్కోని వెళ్లారు. సచివాలయంలో నూతనంగా నిర్మించి ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళి సైతో కలిసి పాల్గొన్నారు. ఆనంతరం సచివాలయంలోని తన ఛాంబర్ కు తీసుకు వెళ్లి ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే.. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా హాజరు కావాల్సిన గవర్నర్ తమిళి సైను ఆ కార్యక్రమానికి ఆహ్వానించనే లేదు. ఇంత కాలం కనీసం గవర్నర్ ఉనికినే విస్మరించిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు తమిళిసై పై ఇంత గౌరవాభిమానాలు ఎందుకు ఒలకబోస్తోందంటే.. అది అంతే  అని సమాధానపడాల్సిందే.