1KG Tomato Price Was RS 10 in Kurnool on Friday: రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. గత నెలలో కిలో టమాటా ధర రూ. 200 నుంచి 240 వరకు పలికి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. అయితే పెరిగిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధరలు దిగొచ్చాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం కిలో టమాటా ధర రూ.10 పలికింది.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా కొనుగోళ్లు శుక్రవారం పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. రైతులు మొదటి రోజే దాదాపుగా 10 టన్నుల సరకు మార్కెట్‌కు తీసుకొచ్చారు. వేలంలో క్వింటాల్ టమాటా రూ. 1000 కంటే తక్కువ ధరే పలికింది. ఆ లెక్కన కిలో టమాటా రూ.10 కూడా పలకలేదు. దాంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వలెనే టమాటా ధరలు భారీగా పడిపోతున్నాయని పత్తికొండ వ్యవసాయ మార్కెట్ వ్యాపారులు అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ ధర మరింత తగ్గే అవకాశం కూడా ఉందట. అయితే బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర మాత్రం ఎక్కువగానే ఉంది. వినియోగదారులు కిలో టమాటాకు రూ.30-40 వరకు పెట్టి కొంటున్నారు. మొత్తానికి రెండు నెలల తర్వాత సామాన్య ప్రజలకు టమాటా అందుబాటులోకి వచ్చింది. దాంతో ప్రతి ఇంట్లో ఇప్పుడు టమాటాలే కనిపిస్తున్నాయి.