Leading News Portal in Telugu

Naseem Shah: నాకు హార్ట్ ఎటాక్ రాదని ఆశిస్తున్నా: పాక్‌ పేసర్‌


Pakistan Pacer Naseem Shah Big Statement on Heart Attack After Last Over Heroics: శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగుతోంది. తొలి వన్డేలో 142 పరుగుల భారీ తేడాతో గెలిచిన పాక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం చివరి వరకు చెమటోడ్చాల్సి వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో యువ సంచలనం నసీం షా పుణ్యమాని పాకిస్తాన్‌ గట్టెక్కింది. పాక్ విజయానికి చివరి రెండు బంతుల్లో 3 రన్స్ అవసరం కాగా.. ఐదో బాల్‌కు ఫోర్‌ బాదిన నసీం షా తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. అయితే చివరి ఓవర్లో తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయిందని నసీం షా చెప్పాడు.

‘ఈ సంవత్సరం నాకు ఇన్నింగ్స్‌ ముగించే అవకాశాలు వస్తున్నాయి. ఏదో ఒకరోజు నాకు హార్ట్ ఎటాక్ మాత్రం రావొద్దని ఆశిస్తున్నా. ఆ అల్లా ఆశీస్సులతో నేను ఎల్లప్పుడూ ఇలానే ఆడుతుంటా. ఆ దేవుడి దయ ఉంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తేలికగానే అధిగమిస్తా. క్లిష్ట పరిస్థితుల్లో నన్ను నేను నమ్ముతాను. అల్లాకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని 20 ఏళ్ల నసీం షా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

‘నేను క్రీజు లోపలికి వెళ్లేసరికి షాదాబ్‌ ఖాన్ ఉన్నాడు. షాదాబ్‌పై నేను నమ్మకంగా ఉన్నా. మేము ఇద్దరం మ్యాచ్ పూర్తి చేస్తామని భావించా. కానీ షాదాబ్ పెవిలియన్ చేరడంతో కథ అడ్డం తిరిగింది. బౌలర్ ఉండడంతో అంతా నాదే భారం అని భావించాను. మ్యాచ్ గెలిపిస్తా అని నాపై నాకు నమ్మకం ఉంది. పాకిస్తాన్‌ను గెలిపించినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయం మాకు చాలా అవసరం. నెట్స్‌లో బ్యాటింగ్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నందున ఇలాంటి పరిస్థితులను సులువుగా ఎదుర్కొంటున్నా’ అని నసీం షా చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌ (151), ఇబ్రహీం జర్దాన్‌ (80) చెలరేగారు. లక్ష్య ఛేదనలో పాక్ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(91) రాణించినా.. మిడిలార్డర్‌ విఫలం అవ్వడంతో ఓటమి దిశగా సాగింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన షాదాబ్‌ ఖాన్‌ (48) విజయాలను చిగురించాడు. చివరి ఓవర్లో 11 రన్స్ అవసరం కాగా.. నసీం షా రెండు ఫోర్స్ బాది ఊహించని విజయం అందించాడు.