BCCI President Roger Binny, Vice Rajeev Shukla To Travel To Pakistan for Asia Cup 2023: పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, లంకలో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పీసీబీ వద్దే ఉన్నా.. దాయాది దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా పాకిస్థాన్ వచ్చే ప్రసక్తే లేదని బీసీసీఐ చెప్పింది. చేసిదిలేక తటస్థ వేదికలపై మెగా టోర్నీ మ్యాచ్‌లను పీసీబీ నిర్వహిస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లు అన్ని లంకలోనే జరుగుతాయి.
పాకిస్థాన్‌లోని ముల్తాన్ వేదికగా ఆగస్ట్ 30న పాకిస్తాన్, నేపాల్ మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు హాజరుకావాలని ఏసీసీ సభ్య దేశాలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆహ్వానాలు పంపించింది. దాంతో భారత్ నుంచి బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జైషా హాజరవుతారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ వర్గాలు కొట్టిపడేశాయి. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే అధికారిక వర్గాల నుంచి ఆమోదం కూడా లభించిందట. అయితే బీసీసీఐ మాత్రం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
సెప్టెంబర్ 5న శ్రీలంక, అఫ్గానిస్థాన్ లాహోర్ వేదికగా జరగనుంది. ఇదే వేదికపై సెప్టెంబర్ 6న సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. ఒకవేళ సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ తలపడితే.. ఆ వేదిక శ్రీలంకకు మారే అవకాశాలు ఉన్నాయి. జై షా, రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాలు సెప్టెంబర్ 2న శ్రీలంకలో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు హాజరవుతారని సమాచారం తెలుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత బిన్నీ, శుక్లా మాత్రమే లాహోర్‌కు వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.