Leading News Portal in Telugu

Kerala: నేలపై కూర్చొని పరీక్ష రాయమన్న ప్రిన్సిపాల్.. విద్యాశాఖ ఫైర్


స్కూల్ ఫీజు కట్టలేదని నేలపై కూర్చొని పరీక్ష రాయమన్నారు ప్రిన్సిపాల్. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. తమ కుమారుడికి స్కూల్ ఫీజు బాకీ ఉన్నందున నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయమని ప్రిన్సిపాల్ ఒత్తిడి చేశారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి శనివారం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా.. విచారణ జరపాలని విద్యా డైరెక్టర్ (డిజిఇ)ని ఆదేశించారు. దర్యాప్తు ఆధారంగా నివేదికను సమర్పించాలని డిజిఇని కోరారు.

తిరువనంతపురంలోని విద్యాధిరాజ విద్యా మందిర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థి గురువారం సైన్స్ పరీక్షకు హాజరవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అదే సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తరగతి వద్దకు వచ్చి ఇంకా ఫీజు కట్టని విద్యార్థులను లేచి నిలబడమని సైగ చేశాడని ఆరోపించారు. స్కూల్ ఫీజు కట్టనందుకు విద్యార్థులను నేలపై కూర్చోబెట్టాలని ప్రిన్సిపాల్ కోరారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

అయితే తరగతి గదిలో స్నేహితుల ముందు అవమానంగా భావించిన విద్యార్థి.. మరుసటి రోజు పరీక్షకు హాజరు కావడానికి పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదని కొన్ని వార్త కథనాలు తెలిపాయి. వేధింపుల ఘటనకు సంబంధించి ప్రశ్నించిన సమయంలో ప్రిన్సిపాల్ తనను కూడా అవమానించాడని విద్యార్థి తండ్రి ఆరోపించాడు.