Leading News Portal in Telugu

Chandrayaan-3: మూడింట రెండు లక్ష్యాలు సాధించాం.. చంద్రయాన్‌-3 మిషన్‌పై ఇస్రో


Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 మిషన్ లక్ష్యాలలో మూడింటిలో రెండింటిని సాధించామని ఇస్రో తెలిపింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో పాటు ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొట్టిందని ఇస్రో వెల్లడించింది. మూడోది చందమామపై శాస్త్రీయ ప్రయోగాల ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా మొదలైందని ఇస్రో శనివారం తెలిపింది. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయం చంద్రయాన్ -3 మిషన్ అన్ని పేలోడ్‌లు సాధారణంగా పని చేస్తున్నాయని తెలిపింది. పేలోడ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయని ట్విటర్ వేదికగా ఇస్రో పేర్కొంది.

చంద్రుని ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. “ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను వెతకడానికి శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోంది.” అని ట్విటర్ వేదికగా చెప్పింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన ప్రాంతాన్ని ఇక నుంచి ‘శివశక్తి’ పాయింట్‌గా పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన ఆగస్టు 23ని ఇప్పుడు జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పిలుస్తామని ఆయన చెప్పారు.