10 Mountaineers Killed, 8 Injured As Minibus Plunges Into Ravine In Iran: ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్వతారోహకులను తీసుకెళ్తున్న మినీబస్సు లోయలో పడిన దుర్ఘటనలో 10 మంది మృతి చెందినట్లు తెలిసింది. ఇరాన్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని వర్జాఘన్ నగరానికి సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగిందని ప్రాంతీయ అత్యవసర సేవల ప్రతినిధి వహిద్ షాదినియా తెలిపారు.
మినీబస్సు పర్వత ప్రాంతంలోని పర్యాటక గ్రామం వైపు వెళుతుండగా.. అదుపుతప్పి లోయలో పడిపోయిందని అధికారి తెలిపారు. సీటు బెల్టులు పెట్టుకుని ఉంటే బాధితుల సంఖ్య తక్కువగా ఉండేదని ప్రాంతీయ అత్యవసర సేవల ప్రతినిధి వహిద్ షాదినియా వెల్లడించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇరాన్‌లో రోడ్లు సాధారణంగా మంచి స్థితిలో ఉన్నప్పటికీ, డ్రైవింగ్ అలవాట్లు సరిగా లేకపోవడం, అలాగే వాహన నిర్వహణపై అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం కారణంగా ఇరాన్ ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ మరణాల రేటును కలిగి ఉంది.