తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 24 మంది సభ్యులతో పాటు మరో నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ పాలకమండలిలో ఉండనున్నారు. అయితే.. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్, కమీషనర్, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవోలను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. లిక్కర్ కేసులో లింకులు ఉన్న శరత్ చంద్రారెడ్డి ని బోర్డు సభ్యునిగా నియమించడం సమంజసం కాదన్నారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాసం గా మారిపోయిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. 2019లో 81 మందిని బోర్డు సభ్యులుగా నియమించారని, కోర్టు సూచనతో 51 మందిగా కుదించారని ఆయన అన్నారు.
వెంటనే ఆధ్యాత్మిక చింతన, హిందూ మత సంప్రదాయాలను పాటించే వారినే బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పట్లో నియమ నిబంధనలు ఇప్పుడు లేవు.. తిరుమల తిరుపతి దేవస్దానమా…లేక జగన్మోహన్ రెడ్డి దేవస్థానమా..? అని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ నియామకాల్లో కూడా కోట్లు చేతులు మారాయని, టీటీడీ యాక్ట్ వంటివి టీటీడీ, ప్రభుత్వ పెద్దలు ఎప్పుడయినా చదివారా అని ఆయన అన్నారు. దీనిపై హైకోర్టులో పిల్ దాఖలు చేశాం.. రాబోవు మంగళవారం విచారణకు రానుందని ఆయన వెల్లడించారు. మీ కేసులకు, పోలీసులకు భయపడే వారు బీజేపీలో లేరని, రాబోవు రోజుల్లో శ్రీవారి భక్తులను కలుపుకుని ఆందోళన చేపడతామని ఆయన ధ్వజమెత్తారు. అడ్డదారుల్లో టీటీడీలో నియామకాలు పెట్టడం ఇదే తొలిసారి అని, టీటీడీ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారో అని అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే టీటీడీ డబ్బులను ఖర్చు పెట్టాలన్నారు.