ప్రాజెక్టులపై చర్చకు రావాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్టులను మేమే కట్టామని ఆర్ధిక మంత్రి బుగ్గన అంటున్నారని, దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి అని ఆయన ఆయన అన్నారు. బహిరంగ చర్చకు మంత్రి బుగ్గన టైమ్, డేట్ చెప్పాలని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకోవడం.. వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనే ద్యాసలో ఉన్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా… రైతులు సమస్యలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చిద్దాం రండి అని సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తీసుకెళ్తుంటే వైసీపీ నేతలు నోరు మెదపడం లేదని, గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించాలని సూర్య ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వర్షాలు పడక రైతులు అల్లాడుతున్నా మంత్రి బుగ్గన, గుమ్మనూరు జయరాంకు కనపడటం లేదా అని సూర్య ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. తుంగభద్ర డ్యామ్ లో ఏపీ వాటా 4 టీఎంసీలు తెప్పించాలని ఆయన అన్నారు. కర్నూలులో హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని, మంత్రి బుగ్గనకు చెప్పే ధైర్యం ఉందా అని ఆయన అన్నారు.