Leading News Portal in Telugu

టీటీడీ పాలక మండలిలో కూడా ఐదుగురు వారే?! | all posts to one social class| ttd| board| five| members| tirupati| hills


posted on Aug 27, 2023 9:43AM

విపక్షంలో ఉండగా వైసీపీ తరచూ చేసిన ఆరోపణ, విమర్శ ఏమిటంటే… ప్రభుత్వంలో, ప్రభుత్వ పదవులలో, నామినేడెట్ పోస్టులలో, కీలక ఆధికారులలో అత్యధికులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని నియమిస్తున్నారు. మిగిలిన సామాజిక వర్గాల వారికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు అంటూ నాడు ఊరూవాడా ఏకం చేసిన వైసీపీ.. అప్పట్లో ఏ సమాజిక వర్గం వారు ఏయే పోస్టులలో ఉన్నారు.. ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తోంది అంటూ వివరాలతో సహా ప్రభుత్వం ప్రకటించినా పట్టించుకోలేదు. సరే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్నది ఏమిటి?  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతనంగా ఏర్పాటైన బోర్డు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ బోర్డు సభ్యులను సుధీర్ఘ చర్చోప చర్చల అనంతరం, అర్హులైన అభ్యర్ధుల సామాజిక స్థితిగతులను బట్టీ, వారి పరపతిని బట్టీ ఎంపిక చేస్తుంటారు.

అలాంటిది ఈసారి బోర్డు సభ్యుల జాబితాలో ఇద్దరు నేర చరిత్ర ఉన్న వారిని ఎంపిక చేయడం విస్మయానికి గురి చేసింది. సర్వత్రా విమర్శలకు తావిచ్చింది ఇప్పటికే కొన్నాళ్ళు జైలు జీవితాన్ని గడిపిన వారు.. నేరాన్ని అంగీకరించిన వారు.. బెయిల్ పై ఉన్నవారికి టీడీపీ పదవులు కట్టబెట్టడంతో హిందూ ధార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వ తీరును ఏకి పారేస్తున్నాయి.  టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక  టీటీడీ పాలకమండలిలో   సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సొంత సామజిక వర్గానికి పెద్ద పీట వేయడం విశేషం. తాజాగా టీటీడీ ప్రకటించిన పాలకమండలి జాబితాలో 24 మంది సభ్యులు ఉండగా అందులో ఐదుగురు రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఆర్. వెంకట సుబ్బారెడ్డి, వై. సీతారామిరెడ్డి, పి. శరత్ చంద్రారెడ్డి, తెలంగాణ ఎంపీ రంజిత్ కుమార్ సతీమణి సీతా రంజిత్ రెడ్డి, సామూల రామ్ రెడ్డి, ఎస్సార్ విశ్వనాథరెడ్డి టీటీడీ పాలక మండలిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. వీరిలో బెంగళూరులో సీఎం జగన్ బంగ్లా ఉన్న యలహంక ప్రాంత ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాధ్ రెడ్డి ఇప్పటికే టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ఉండగా.. ఇప్పుడు మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం విశేషం. 

ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా గత నాలుగేళ్లుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు.. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పదవిని అప్పగించింది. తిరుమల కొండపైన చైర్మన్ తర్వాత కీలక పదవులైన.. ఈవో, జేఈవోలు కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారే. ఇప్పుడు 24 మంది సభ్యులలో ఐదుగురు సభ్యులను కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే అప్పగించారు. మరోవైపు తిరుపతి కొండ కింద తిరుపతి పట్టణం, తిరుపతి రూరల్ లో కూడా ఆ సామాజికవర్గం వారికే పదవులు కట్టబెట్టారు. జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటివరకు తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవిలో ఉండగా.. ఈ మధ్యనే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఆ పదవి అప్పగించారు. తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు, తిరుపతి ఆర్డీవో, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఇలా ఎక్కడ చూసినా కీలక ఉన్నత పదవులలో ఆ సామాజికవర్గం వారే కనిపిస్తున్నారు. 

నిజానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కీలక పదవులు, ఉన్నతాధికారులు, నామినేటెడ్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల సలహాదారులు ఇలా ఎక్కడ చూసినా ఆ సామజిక వర్గానికి చెందిన వారి పేర్లే వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ఏ మాత్రం పట్టించుకోని జగన్.. రెడ్డి సామజిక వర్గానికే పదవులలో పెద్ద పీఠ వేస్తూనే ఉన్నారు. ఎవరు ఎన్ని అన్నా.. ఎంతగా దుమ్మెత్తి పోసినా ప్రభుత్వంలో ఎలాంటి బెరుకూ కనిపించడం లేదు. జవాబుదారీతనం ఇసుమంతైనా కనిపించడం లేదు.